జయసుధ వారసుడి పెళ్లి ఫిక్స్

Thu Sep 12 2019 16:49:05 GMT+0530 (IST)

Jayasudha elder son Nihar Kapoor is all set to tie the knot

సహజనటి జయసుధ ప్రస్థానం గురించి తెలిసిందే. తెలుగు-తమిళం- హిందీ-మలయాళ పరిశ్రమలకు సుపరిచితం. టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా దశాబ్ధాల పాటు కొనసాగిన జయసుధ(60) అటుపై రాజకీయాల్లోనూ రాణించారు. హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ ని 1985లో రెండో వివాహం ఆడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు నిహార్ బిజినెస్ మేన్. రెండో వాడు శ్రేయాన్ కపూర్ హీరో అయ్యారు. శ్రేయాన్ జాతీయ స్థాయి క్రీడల్లో షూటర్ గానూ రాణించారు.



తాజా సమాచారం ప్రకారం.. సహజనటి ఇంట బ్యాండ్ బాజా మోగనుందని తెలుస్తోంది. పెద్ద కొడుకు నిహర్ కపూర్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. దిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత్ కౌర్ ని అతడు వివాహమాడనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ముహూర్తం ఫిక్సయ్యింది.

భర్త నితిన్ కపూర్ మరణానంతరం జయసుధ పూర్తిగా సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయంగా తనకు ప్లస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో సికిందరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగిన జయసుధ కొన్నాళ్ల పాటు రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సామాజిక కార్యక్రమాలకే అంకితమయ్యారు. ఇటీవలే పార్టీ మారిన సంగతి తెలిసిందే. గత జనరల్ ఎలక్షన్స్ కి ముందు వైయస్సార్ సీపీ పార్టీ ఏపీ వింగ్ లో చేరారు. మహిళా నాయకురాలిగా ఎంతో పరిణతితో సేవలందిస్తున్నారు. కుమారుడు నిహర్ వివాహం.. ఇంట్లో తొలి పెద్ద వేడుక కాబట్టి గ్రాండియర్ గా ఉంటుందనే చెబుతున్నారు. పరిశ్రమలో టీఎస్సార్- చిరంజీవి- మోహన్ బాబు- బాలకృష్ణ ఇలా ఎందరో స్నేహితులు ఉన్నారు. సౌత్ - నార్త్ నుంచి సినీరాజకీయ వర్గాల్లో స్నేహితులందరినీ ఈ పెళ్లికి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.