పాన్ ఇండియా 'మైఖేల్' మూవీలో క్రాక్ జయమ్మ..!

Thu Jan 20 2022 17:42:33 GMT+0530 (IST)

Jayamma in Pan India 'Michael' movie ..!

యంగ్ హీరో సందీప్ కిషన్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''మైఖేల్''. తెలుగు తమిళం కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుండగా.. విలన్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించనున్నారు.''మైఖేల్'' చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో 'క్రాక్' 'నాంది' వంటి చిత్రాల్లో మెప్పించిన వరలక్ష్మీ.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా నటించే పాన్ ఇండియా మూవీలో భాగం అయింది.

గతంలో సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ' చిత్రంలో వరలక్ష్మి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ''మైఖేల్'' సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

రంజిత్ జయకోడి రచించిన విలక్షణమైన స్క్రిప్ట్ లో సందీప్ కిషన్ ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నారు. జాతీయ ఉత్తమ నటుడు విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.

'మైఖేల్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ సంస్థలు రూపొందిస్తున్నాయి. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు మరియు సిబ్బంది వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.