టాలీవుడ్ పై దృష్టి పెట్టిన జయం రవి?

Fri May 07 2021 15:25:24 GMT+0530 (IST)

Jayam Ravi focusing on Tollywood

కోలీవుడ్ హీరోల్లో చాలామంది తమ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. రజనీకాంత్ .. కమలహాసన్ తో పాటు విక్రమ్ .. సూర్య .. కార్తి .. విజయ్ .. విశాల్ .. ధనుశ్ .. ఇలా అంతా కూడా తెలుగు మార్కెట్ పై తమ ప్రభావం చూపుతూనే వస్తున్నారు. తెలుగులో తమ సినిమాలు అంతగా ఆడకపోయినా ఎంత మాత్రం నిరాశపడకుండా తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. తమ మార్కెట్ తో పాటు అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు.అయితే వాళ్లలో ఒక హీరో మాత్రం టాలీవుడ్ పై ఇంతవరకూ అంతగా ఆసక్తిని చూపలేదు ... ఆ హీరో పేరే జయం రవి. ఈ హీరో ఎవరో కాదు .. తెలుగులో కృష్ణంరాజుతో 'బావ బావమరిది' .. 'పల్నాటి పౌరుషం' వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎడిటర్ మోహన్ తనయుడే. అందువల్లనే ఆ రెండు సినిమాల్లో జయం రవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఆ తరువాత తమిళంలో 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు అక్కడ స్టార్ హీరోగా తన జోరు చూపుతున్నాడు.

హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన టాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనిపించదు. కానీ ఇటీవలే ఆయన కూడా టాలీవుడ్ వైపు చూస్తున్నాడు. ఇకపై తమిళంలో తాను చేసే సినిమాలు తెలుగులోను తప్పకుండా విడుదలయ్యేలా చూసుకోవాలని అనుకుంటున్నాడట. అంతేకాదు తెలుగులో స్టైలిష్ విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అటు హీరోగానే కాదు .. ఇటు విలన్ గాను మెప్పించే కటౌట్ కనుక ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.