'జాతిరత్నం' కొత్త సినిమా ప్రకటన.. నిర్మాతగా త్రివిక్రమ్ భార్య..!

Wed Sep 15 2021 10:45:23 GMT+0530 (IST)

Jathi Ratnam Upcoming Movie Loading

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా మారిన యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో 'చిచోరె' సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'జాతిరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని.. కరోనా పరిస్థితుల్లోనూ సంచలనం సృష్టించాడు. హ్యాట్రిక్ విజయాలతో జోష్ మీదున్న నవీన్ పోలిశెట్టి.. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.అయితే 'జాతిరత్నాలు' సినిమా వచ్చి ఆరు నెలలు గడిచినా యువ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించకపోవడంతో.. పోలిశెట్టి ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. మూడూ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లతోనే అని నవీన్ ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ఈరోజు బుధవారం వాటిలో ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

'జాతి రత్నాలు' దర్శకత్వశాఖలో పనిచేసిన కళ్యాణ్ శంకర్ తో నవీన్ పోలిశెట్టి ఈసారి చేతులు కలపనున్నారు. కళ్యాణ్ శంకర్ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ.. అతని ఆలోచనలు - స్టోరీ నెరేషన్ కు ఆకర్షితుడై నవీన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది వినోదాత్మకంగా చెప్పబడే ఒక యూనిక్ కాన్సెప్ట్ అని మేకర్స్ వెల్లడించారు. ఇందులో బలమైన కథను సరదా సరదాగా చెప్తున్నామని తెలిపారు. నవీన్ పోలిశెట్టి ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నామని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ తెలిపారు. తాజాగా నవీన్ నాలుగో చిత్రాన్ని సంబంధించిన ఓ అనౌన్స్ మెంట్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూకుడు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత ఎస్.రాధాకృష్ణ కుటుంబంతో మంచి అనుబంధాన్ని కలిగిన త్రివిక్రమ్.. కొంతకాలంగా వారి బ్యానర్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ తో కలసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య #NP4 సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెడుతోంది. ఇది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న 15వ సినిమా. ఈ ఫన్ ఫిల్ల్డ్ ఎంటర్టైనర్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించబడతాయి.