Begin typing your search above and press return to search.

హాలీవుడ్ దర్శకుడికి ఏకలవ్య శిష్యుడిగా ప్రకటించుకున్న జక్కన్న..!

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
హాలీవుడ్ దర్శకుడికి ఏకలవ్య శిష్యుడిగా ప్రకటించుకున్న జక్కన్న..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ చిత్రానికి గ్లోబల్ రీచ్ వచ్చింది. అనేక మంది పాపులర్ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ మరియు విమర్శకులు RRR సినిమాపై ప్రశంసలు కురిపించారు. దీన్ని ఒక విజువల్ వండర్ గా అభివర్ణించారు.

రాజమౌళి పనితనాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకున్నారు. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ - ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు 'కొమురం భీముడో' సాంగ్ చిత్రీకరణ వెనకున్న మాస్టర్ మైండ్ ను అందరూ అభినందించారు.

ఇటీవల పాపులర్ హోస్టులు జోష్ ఓల్సన్ - జో డాంటే నిర్వహించిన పోడ్ కాస్ట్ లో పాల్గొన్న రాజమౌళి.. RRR సినిమా విషయంలో తనకు స్ఫూర్తినిచ్చిన అంశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సెకండాఫ్ లో వచ్చే 'కొమురం భీముడో' పాట గురించి వివరించారు.

'కొమరం భీముడో' పాట వెనుక హాలీవుడ్ డైరెక్టర్ మెల్ గిబ్సన్ 'బ్రేవ్ హార్ట్' ప్రేరణ ఉందని రాజమౌళి వెల్లడించారు.  1995లో వచ్చిన ఈ వార్ డ్రామా క్లైమాక్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ పాటను చిత్రీకరించినట్లు తెలిపారు.

RRR లో బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన భీమ్ ను రామారాజు కొరడా తో కొట్టడాన్ని ఎంతో ఎమోషనల్ గా చిత్రీకరించారు. ఇందులో ఎన్టీఆర్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. అయితే దీన్ని ఇంగ్లీష్ సినిమాలోని సన్నివేశం ఆధారంగా తీసినట్లు జక్కన్న చెప్పారు.

అంతేకాదు మెల్ గిబ్సన్ ద్రోణాచార్యుడైతే.. తాను ఏకలవ్య శిష్యుడనని కూడా రాజమౌళి పేర్కొన్నారు. గతంలో అగ్ర దర్శకుడు తెరకెక్కించిన అనేక సినిమాలలోని సన్నివేశాలు పలు హాలీవుడ్ చిత్రాలను పోలి ఉంటాయని నెటిజన్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా వచ్చే ఏడాది ఆస్కార్ లు నామినేట్ అయ్యే అవకాశం ఉందని.. పలు విభాగాల్లో అవార్డులు కూడా గెలుచుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ అనుకుంటున్నట్లుగానే రాజమౌళి చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డ్ వస్తుందేమో చూడాలి.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత యోధుల స్పూర్తితో రాసుకున్న కల్పిత కథతో 'RRR' చిత్రాన్ని తెరకెక్కించారు. విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.