'జనని' సాంగ్ స్పెషల్ స్క్రీనింగ్.. జక్కన్న ప్రచార వ్యూహాలు ఊహాతీతం..!

Thu Nov 25 2021 12:32:00 GMT+0530 (IST)

Jakkanna Campaign Strategies Unimaginable

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 7న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీలకు తెర లేపారు జక్కన్న.సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో మాస్టర్ స్టోరీ టెల్లర్ వ్యూహాలు ఊహకందవనే సంగతి తెలిసిందే. సినిమా స్టోరీ మొత్తాన్ని ముందే చెప్పేసి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ఘనుడు రాజమౌళి. నాలుగేళ్లు షూటింగ్ దశలో ఉన్న సినిమా మీద ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేయగలిగే మేధావి ఆయన. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రచారం విషయంలో కూడా అగ్ర దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా దూసుకువెళ్తున్నారు.

ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ - ఇద్దరు హీరోల టీజర్లు - గ్లిమ్స్ - రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో 'జనని' అనే ఎమోషనల్ గీతాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 26న ఈ లిరికల్ వీడియో రాబోతోందని వెల్లడించారు. 'RRR సోల్ ఆంథెమ్' పేరుతో రాబోతున్న ఈ పాట కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

అయితే సరిగ్గా ఇక్కడే జక్కన్న ఓ కొత్త పద్ధతి ఫాలో అయ్యారు. సినిమాకు ఎలాగైతే ముందురోజు ప్రివ్యూలు - బెనిఫిట్ షోలు వేస్తారో.. అలానే 'జనని' పాట కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈరోజు గురువారం మీడియా మిత్రులందరినీ ఆహ్వానించి.. PVRRRR లో 'జనని' ఎమోషనల్ వీడియో సాంగ్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి - నిర్మాత డీవీవీ దానయ్య మీడియాతో మాట్లాడారు. రేపు సాయంత్రం ఈ విజువల్ పాటను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో అధికారికంగా విడుదల చేస్తారని తెలిపారు.

'జనని' పాటకు కీరవాణి అద్భుతమైన స్వరాలు సమకూర్చారని ఇన్సైడ్ టాక్. RRR సినిమాలో చెప్పదలుచుకున్న కథ యొక్క ప్రధానాంశం - ఆత్మ మరియు ఉద్దేశం ఈ పాటలో ఉంటుందని రాజమౌళి తనయుడు కార్తికేయ చెప్పారు. ఈ పాట నిజంగా తనను కదిలించిందని.. హృదయాన్ని లోతుగా ప్రేరేపించిందని.. ప్రేక్షకుల నుంచి కూడా ఇదే విధమైన స్పందన లభిస్తుందని ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే 'జనని' పాట గురించి సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ ను జైలులో చిత్ర హింసలకు గురిచేయడం.. చరణ్ స్థితిని తలచుకొని ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యే దృశ్యాలు.. అలియా భట్ ను ఎన్టీఆర్ ఓదార్చే సన్నివేశం.. జైలులో ఎన్టీఆర్ ను చిత్రహింసలు పెట్టినందుకు చరణ్ బాధ పడటం.. అజయ్ దేవగన్-శ్రీయా మధ్య వచ్చే సీన్ తెరపై అద్భుతంగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. వీటిల్లో నిజమెంతో తెలియాలంటే రేపు 'జనని' పాట రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.