Begin typing your search above and press return to search.

జై భీమ్‌ వివాదం.. జ్యోతిక పేరు కూడా వచ్చింది

By:  Tupaki Desk   |   24 Nov 2021 12:30 AM GMT
జై భీమ్‌ వివాదం.. జ్యోతిక పేరు కూడా వచ్చింది
X
సూర్య హీరోగా జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జై భీమ్‌'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ లో డైరెక్ట్‌ విడుదల అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కొందరు విమర్శలకు దిగుతున్నారు. సినిమాలో ఆదివాసీలను పోలీసులు హింసించి కేసులు పెట్టే వారు అని చూపించేందుకు గాను వన్నియార్ సామాజిక వర్గంకు చెందిన వాళ్లను విలన్ లుగా చూపించే ప్రయత్నం చేశారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఆ విమర్శలు కాస్త కోర్టు వరకు వెళ్లాయి. వన్నియార్ సంఘం నాయకులు కోర్టులో ఏకంగా అయిదు కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఈ విషయమై ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు కొందరు రాజకీయ నాయకులు కూడా సూర్యకు మద్దతు తెలుపుతున్నారు.

సూర్య మరియు ఇతర కుటుంబ సభ్యులపై వన్నియార్ సంఘం వారు దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ అనుమానాలు రావడంతో భారీ ఎత్తున పోలీసు ప్రొటక్షన్ ను సూర్య కుటుంబంకు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు ప్రభుత్వం కల్పించింది. సినిమా ను స్వయంగా తానే నిర్మించిన నేపథ్యంలో సూర్య రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే అమెజాన్ వారు వారి మనోభావాలను దెబ్బ తీసిన ఆ సన్నివేశంను తొలగించినట్లుగా పేర్కొన్నారు. అయినా కూడా వారు మాత్రం కేసు వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. జై భీమ్‌ సినిమా వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగేలా కనిపిస్తుంది.

తాము వేసిన కేసు విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అస్సలు స్పందించడం లేదు అంటూ వారు మళ్లీ కేసు నమోదు చేశారు. ఈసారి నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్ ను ఏ1 గా తీసుకోవాలని.. సూర్యను ఏ2 గా.. జ్యోతికను ఏ3 గా.. దర్శకుడు జ్ఞానవేల్ ను ఏ4 గా.. అమెజాన్ ను ఏ5 గా చేర్చుతూ కేసు బుక్‌ చేయడం జరిగింది. జ్యోతికను ఈ వివాదంలోకి లాగడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తో ఎలాంటి సంబంధం లేని ఆమెను ఎందుకు ఈ కేసులో చేర్చారంటూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జ్యోతిక ను ఈ కేసులో చేర్చడంతో సూర్య అండ్ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మరింత మద్దతు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.