Begin typing your search above and press return to search.

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు 'జై భీమ్'..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:31 PM GMT
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు జై భీమ్..!
X
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ''జై భీమ్''. టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలై అశేష ప్రేక్షకాదరణ అందుకుంది. ఇది సూర్య కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఓ మైలురాయి చిత్రమని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.

జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా 'జై భీమ్' సినిమా రూపొందింది. భారతదేశంలోని సామాజిక అసమానతలు - కుల వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజనులు, అణగారిన వర్గాలు - ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై అన్యాయంగా కొందరు పోలీసులు చేసే దుశ్చర్యలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన 'జై భీమ్' చిత్రం గురించి ఇటీవల ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో కొనియాడారు. అలానే సినిమా రేటింగ్​ సంస్థ IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ క్రమంలో 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు సూర్య సినిమా అధికారికంగా ఎంపిక కాబడింది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కాగా, 'జై భీమ్' చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య - జ్యోతిక నిర్మించారు. ఇందులో సూర్య తో పాటుగా మణికందన్ - లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ - రజిషా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సీన్ రోల్డాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎస్ ఆర్ కాథిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ''జై భీమ్'' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.