భారీ పారితోషికంతో 'జబర్దస్త్' కమెడియన్ల జోరు!

Mon Sep 20 2021 07:00:01 GMT+0530 (IST)

Jabardasth comedians throng with huge remuneration

సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవాలంటే సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆడిషన్స్ కోసం వెళ్లి ఆకలిని మరిచిపోయి వెయిట్ చేయాలి. అదృష్టం బాగుండి అవకాశం వచ్చినా ఆ ఒక్క అవకాశంతో నిలదొక్కుకునే అవకాశం లభించడం అరుదు.  సరైన పాత్ర కోసం ఎంతకాలం వెయిట్ చేయాలో .. పారితోషికం గట్టిగా అడిగే రోజులు ఎప్పుడు వస్తాయనేది ఎవరికి తెలియదు. అలాంటివారికి ఆశాకిరణంలా మారిన టీవీ షో 'జబర్దస్త్' అని చెప్పవచ్చు.'జబర్దస్త్' స్టేజ్ పై సందడి చేసిన వాళ్లలో చాలామంది ఈ రోజున ఒక రేంజ్ లో ఉన్నారు. ఎంతోమంది కమెడియన్లు ఈ షో ద్వారా వెండితెరకి పరిచయమయ్యారు. సుడిగాలి సుధీర్ .. గెటప్ శ్రీను .. హైపర్ ఆది వంటివారు వేరే టీవీ షోలు చేసినా .. సినిమాలు చేసినా అందుకు కారణం 'జబర్దస్త్' అని చెప్పక తప్పదు. వెన్నెల కిషోర్ తరువాత వరుసలో కామెడీ చేసే ఆర్టిస్టులు ఎక్కువగా లేరు. సప్తగిరి .. షకలక శంకర్ .. సత్య హీరో వేషాలతో బిజీగా ఉన్నారు. దాంతో జబర్దస్త్ ఆర్టిస్టులను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయట.

జబర్దస్త్ కమెడియన్లను తీసుకోవడం వలన సెట్స్ పైనే డైలాగ్స్  మార్చుకుంటారు .. రాసుకుంటారు .. అవసరమైతే సీన్ డెవలప్ చేస్తారు. ఒక టీమ్ గా మాట్లాడుకుని చేసేసి వెళ్లిపోతారు. అందువలన వాళ్లను తీసుకోవడం వలన సమయం కూడా కలిసివస్తుందని దర్శకులు భావిస్తున్నారట. దాంతో వాళ్ల డిమాండ్ ..  అందుకు తగిన పారితోషికం కూడా పెరిగిపోయాయని చెప్పుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ .. హైపర్ ఆది .. గెటప్ శ్రీను వీళ్లంతా కూడా రోజుకు 50 వేల నుంచి 75 వేలు తీసుకుంటున్నారట. కాలం కలిసిరావడమంటే ఇదేమరి.