జబర్దస్త్ ఆర్టిస్ట్.. పె..ద్ద స్మగ్లర్!

Thu Jul 12 2018 10:32:51 GMT+0530 (IST)

బుల్లితెరపైన తన హాస్యంతో నవ్వులు పువ్వులు పూయించే ఆర్టిస్ట్ ఒకరు తెర వెనుక చేసే పనులు బయటకు రావటంతో షాక్ తినటం పోలీసుల వంతైంది. సీరియల్స్ లోనూ.. జబర్దస్త్ కార్యక్రమంలోనూ చిన్న చిన్న పాత్రలువేసే ఒక అర్టిస్ట్ భాగోతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆ మధ్య వరకు సాదాసీదా ఆర్టిస్ట్ గా నే అందరికి తెలిసిన అతగాడి బ్యాక్ గ్రౌండ్ గుట్టు రట్టు అయిన అందరికి ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణాతో సదరు ఆర్టిస్ట్ ఇప్పుడు కోట్లకు పడగలెత్తటమే కాదు.. సినిమాలకు ఫైనాన్స్ చేసే వరకూ వెళ్లటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తిరుపతికి చెందిన ఒక సాదాసీదా వ్యక్తి టీవీ సీరియల్స్ లోనూ.. జబర్దస్త్ కార్యక్రమంలో పాత్రలు పోషిస్తుంటాడు. దాంతో వచ్చే సంపాదన తృప్తిని ఇవ్వలేదు. అదే సమయంలో ఆర్టిస్ట్ గా వచ్చి ఫేంతో పరిచయమైన పరిచయాలతో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తే వచ్చే లాభాల లెక్క అతడి మనసును మార్చేసినట్లు చెబుతున్నారు.

దీంతో.. తనకు పరిచయమైన స్మగ్లర్లతో కలిసి శేషాచలం అడవుల్లో భారీగా ఉన్న ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణాతో ఇతర రాష్ట్రాలకు తరలించే కార్యక్రమాన్ని మొదలెట్టాడు.స్వల్ప వ్యవధిలోనే కోట్లకు అధిపతిగా అయ్యాడు. ఇతగాడి ఘనకార్యం గురించి తిరుపతి టాస్క్ ఫోర్సు సిబ్బందికి సమాచారం అందింది.

ఇటీవల విడుదలైన ఒక సినిమాకు సదరు ఆర్టిస్ట్ ఫైనాన్స్ చేసిన వైనం బయటకు వచ్చింది. జబర్దస్త్ లో తన తోటి ఆర్టిస్ట్ నటించిన మూవీకి అతగాడి ఫైనాన్స్ ఫుల్ అన్న మాట వినిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి అతగాడి పాత్రను ఫ్రూవ్ చేసే పక్కా సాక్ష్యాలు లభించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనిపై 20 కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతడి స్మగ్లింగ్ దందాలో మరో విశేషం ఏమిటంటే.. కొందరుస్టూడెంట్స్ తో ఆటు.. డాక్టర్లు.. ఇంజినీర్లు.. ప్రైవేటు ఉద్యోగుల్ని సైతం స్మగ్లింగ్ లో భాగస్వామ్యం చేసినట్లుగా చెబుతున్నారు. ఇతగాడు పోలీసులకు దొరికితే.. పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.