Begin typing your search above and press return to search.

కావాలనే షూటింగుకి ఎగ్గొట్టాను .. దాసరి గారికి కోపం తెప్పించాను: జేడీ చక్రవర్తి

By:  Tupaki Desk   |   15 Oct 2021 9:30 AM GMT
కావాలనే షూటింగుకి ఎగ్గొట్టాను .. దాసరి గారికి కోపం తెప్పించాను: జేడీ చక్రవర్తి
X
శివ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన జేడీ చక్రవర్తి, ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు. వర్మ స్కూల్ నుంచి వచ్చిన జేడీ, ఆ తరువాత దర్శకుడిగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వర్మ మాదిరిగానే జేడీ తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటాడు. తనదాకా వస్తే ఎంతవరకు వెళ్లడానికైనా వెనుకాడడని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. ఇదే ధోరణిని ఆయన తన ఇంటర్వ్యూలలో సైతం చూపిస్తూ ఉంటాడు.

తాజాగా 'చక్రి భ్రమణం' అనే టైటిల్ కింద జరిగిన ఇంటర్వ్యూలో, జేడీ తనకి సంబంధించిన అనేక విషయాలను తడుముకోకుండా చెప్పేశాడు. దాసరి నారాయణరావుతో జరిగిన గొడవను గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. "దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో 'నియంత' సినిమా షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా హీరోగా రాజశేఖర్ ను అనుకున్నారు. ఆ తరువాత ఏదో గొడవ జరిగి వినోద్ కుమార్ ను తీసుకున్నారు. ఆ సినిమాలో నేను చేస్తానని చెప్పడం వాస్తవం .. రేపు షూటింగు అనగా మానేయడమనే విషయంలో సగం మాత్రమే వాస్తవం ఉంది.

నిజానికి షూటింగుకి ఒక గంట ముందు మానేయాలనే కోరికతో .. అభిలషతో ఉన్నాను. కానీ కుదరక పోవడం వలన ఒక రోజు ముందుగా మానేస్తున్నట్టుగా చెప్పవలసి వచ్చింది. ఆ సినిమా కోసం నెల రోజుల ముందుగా డేట్లు అడిగారు .. నెల రోజుల ముందుగానే డేట్లు ఉన్నాయని నేను చెప్పాను. దాసరి గారి సినిమాలో చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందువలన నిర్మాతలు ఎవరనేది కూడా నాకు అనవసరం, డబ్బులు ఇవ్వకపోయినా డేట్లు ఇస్తానని కో డైరెక్టర్ రవికి చెప్పాను. 20 మంది ఆర్టిస్టుల కాంబినేషన్లో సీన్లు ఉన్నాయని చెప్పి, రవి నా డేట్లు తీసుకున్నాడు. ఆ తరువాత నుంచి దాసరిగారి దర్శకత్వంలో సినిమా చేసే సమయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తూ రోజులు గడిపాను.

మధ్య మధ్యలో దాసరి గారి ఆఫీస్ నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి .. వాళ్లు డేట్లు గుర్తుచేస్తూనే ఉన్నారు. నేను రెడీగానే ఉన్నానని చెబుతూనే ఉన్నాను. ఆ డేట్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఆ ఉత్సాహంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. షూటింగు రేపు ఉదయం .. రెడీగా ఉండమని దాసరి గారి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. 'నేను రావడం లేదు' అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరుగా నాకు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. 'క్షణక్షణం'లో ఒక రౌడీ రాకపోతే వాడికి నేను డూప్ గా వేస్తున్నాననీ, అందుకే రాలేకపోతున్నాని చెప్పాను. ఆ మాటకి వాళ్లంతా మరింత షాక్ అయ్యారు.

మర్నాడు ఉదయమే షూటింగు .. 20మంది ఆర్టిస్టుల కాంబినేషన్లోని సీన్స్ ను ప్లాన్ చేశారు. నేనేమో రానని అంటున్నాను. ఇప్పుడు వాళ్లు ఆ విషయాన్ని దాసరి గారికి చెబుతారు .. ఆయన నాకు కాల్ చేస్తారు అనుకున్నాను. ఆయన కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిజానికి నేను షూటింగుకి వెళ్లకపోవడమనేది దాసరి గారి స్థాయి మనిషి అసలు పట్టించుకునే విషయమే కాదు. కానీ వేరే వారిని సెట్ చేసేంత సమయం అక్కడ లేదు. దాసరి గారు కాల్ చేశారు .. అప్పుడు ఆ ఫోన్ రింగ్ సౌండ్ నాకు బాలుగారు పాడుతున్నట్టుగా అనిపించింది.

ఆ తరువాత ఆయన రామ్ గోపాల్ వర్మకి కాల్ చేశారట. నా పేరు పలకడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అందువల్లనే "నీ దగ్గర ఉంటాడే ఆ గెడ్డం కుర్రాడు .. వాడు రేపు షూటింగ్ అంటే రానంటున్నాడట .. నువ్వు కాస్త చెప్పు .. ఎందుకు రావడం లేదని అడిగితే, నీ సినిమాలో ఫైటర్ కి డూప్ గా వేస్తున్నానాని చెప్పాడట. వాడికి పిచ్చా నాకు పిచ్చా అనేదే అర్థం కావడం లేదు .. ఆ రీజన్ ఏమిటి? ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాడా? అన్నారట. 'మరుసటి రోజు జేడీని నా షూటింగుకి రావద్దని చెబుతాను. మీ షూటింగుకు రావాలా వద్దా అనేది అతని ఇష్టం' అన్నాడు వర్మ. ఆ రోజున వాళ్లని ఇబ్బంది పెట్టినందుకు కొంతమందికి పార్టీ కూడా ఇచ్చాను. అలా ఎందుకు చేశాననేది తరువాత ఎపిసోడ్లో చెబుతాను .. అప్పటి వరకూ వెయిట్ చేయవలసిందే" అంటూ జేడీ సస్పెన్స్ లో పెట్టేశాడు.