Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'ఇస్మార్ట్ శంకర్'

By:  Tupaki Desk   |   18 July 2019 10:20 AM GMT
మూవీ రివ్యూ: ఇస్మార్ట్ శంకర్
X
చిత్రం :'ఇస్మార్ట్ శంకర్'

నటీనటులు: రామ్ - నిధి అగర్వాల్ - నభా నటేష్ - సత్యదేవ్ - షాయాజి షిండే - పునీత్ ఇస్సార్ - ఆశిష్ విద్యార్థి - మధు - గెటప్ శీను తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాణం: పూరి కనెక్ట్స్
రచన - దర్శకత్వం: పూరి జగన్నాథ్

ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు అందించిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి ఓ మోస్తరు సినిమా వచ్చి కూడా చాలా కాలం అయింది. ‘టెంపర్’ మినహాయిస్తే గత దశాబ్దంలో పూరి తీసిన సినిమాలన్నీ నిరాశ పరిచినవే. మళ్లీ తనేంటోో రుజువు చేసుకుందామని ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడాయన రామ్ హీరోగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇదైనా ‘పూరి ఈజ్ బ్యాక్’ అనిపించిందా? చూద్దాం పదండి.

కథ:

శంకర్ (రామ్) హైదరాబాద్ పాతబస్తీలో అనాథగా పెరిగిన కుర్రాడు. తాను బాబాయిగా భావించే కాకా (మధు) అండతో పెరిగి పెద్దవుతాడు. ఆయన సపోర్టుతో సెటిల్మెంట్స్, డీల్స్ చేస్తూ బతుకుతుంటాడు. తన లైఫ్ సెట్ అయిపోయే డీల్ అని కాకా చెప్పాడని.. ఒక హత్య చేస్తాడు శంకర్. కానీ అందులో అతను అడ్డంగా ఇరుక్కుపోవడమే కాక.. దాని వల్ల తన ప్రేయసి (నభా నటేష్)ను కూడా కోల్పోతాడు. జైల్లో ఉన్న అతను అక్కడి నుంచి తప్పించుకుని తనకు అన్యాయం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడతాడు శంకర్. అతడి ప్రయత్నం ఏమేరకు ఫలించింది.. ఇంతకీ ఈ కేసులో అతడిని ఇరికించింది ఎవరు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఇదేమీ స్పాయిలర్ కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్లో చూపించిన విషయమే. హీరో తలలోకి వేరే వ్యక్తి జ్ఞాపకాలతో ఉన్న చిప్ ఒకటి పెడితే.. అతడి మెమొరీ అంతా ఇతడిలోకి వచ్చి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఒకసారి తనలా ఉంటాడు. ఇంకోసారి వేరే వ్యక్తిలా ప్రవర్తించి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూస్తున్నపుడు.. పూరి బుర్రలో కూడా ఇలా చిప్ ఏమైనా పెట్టుకున్నాడా? ఆ చిప్ పదేళ్ల కిందటి పూరీదేనా అనిపిస్తుంది. అప్పట్లో ఆయన టేకింగ్ లో చూపించిన వేగం.. మాస్ కు పూనకాలు తెప్పించే హీరోయిజం.. పూరి మార్కు ఎక్సెంట్రిక్ మూమెంట్స్.. ‘ఇస్మార్ట్ శంకర్’లో అక్కడక్కడా కనిపిస్తాయి. కానీ ఇదంతా క్యామియో తరహా వ్యవహారమే. సినిమాలో పాత పూరి కనిపించేది చాలా పరిమిత సమయం మాత్రమే. పూరి ఈజ్ బ్యాక్ అనుకునే లోపే.. ఆ చిప్ పని చేయడం మానేసినట్లుగా.. మళ్లీ ఇప్పటి పూరీనే కనిపిస్తాడు. ఆయనే డామినేట్ చేస్తాడు.

పూరి ఈసారి కొంచెం రూటు మార్చి ఒక భిన్నమైన సైంటిఫిక్ థ్రిల్లర్ కథను ఎంచుకున్నాడు కానీ.. దాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పక.. కమర్షియల్ హంగులు అద్దబోయి.. తనదైన మాస్ హీరోయిజం చూపించబోయి ‘ఇస్మార్ట్ శంకర్’ను ఎటూ కాకుండా తయారు చేశాడు. ఒక వ్యక్తికి మెమొరీ లాస్ అయితే.. మొత్తం గతం మరిచిపోవాలి కానీ.. ఒక విషయం జరిగిన 15 నిమిషాల తర్వాత మరిచిపోవడం అన్నది లాజికల్‌గా అనిపించదు. కానీ ఈ కాన్సెప్ట్‌ను ‘గజిని’లో మురుగదాస్ ఎంత బాగా డీల్ చేశాడు? ఎంత కన్విన్సింగ్‌గా ఆ పాయింట్‌ను చెప్పాడు. దాని చుట్టూ కథాకథనాల్ని ఎంత బాగా అల్లాడు? సినిమాలో ఎంత బిగి కనిపిస్తుంది? కానీ ‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో తలలో చిప్ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తుల్లా మార్చి మార్చి ప్రవర్తించే తీరు చూస్తే నవ్వు ఆగదు. చదువూ సంధ్యా లేని ఊర మాస్ ఇస్మార్ట్ శంకర్.. ఉన్నట్లుండి పోష్ ఇంగ్లిష్ మాట్లాడుతూ సీబీఐ ఆఫీసర్ అంటూ కలర్ ఇస్తుంటే కామెడీగా అనిపిస్తుంది తప్ప సీరియస్నెస్ రాదు. ఈ సన్నివేశాల్ని పూరి డీల్ చేసిన తీరు చూస్తే దర్శకుడిగా ఆయన స్థాయి ఎంత పడిపోయిందో అర్థమవుతుంది.

సొంత ఐడియానా.. ఎక్కడైనా స్ఫూర్తి పొందాడా తెలియదు కానీ.. పూరి ఐడియా కొత్తగా అనిపిస్తుంది. కానీ ఎంతో కసరత్తు చేసి.. ఎన్నెన్నో లాజికల్ క్వశ్చన్స్ వేసుకుని.. వాటికన్నటికీ సమాధానాలు చెప్పుకుని.. ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా బిగితో ఈ పాయింట్ ను చెప్పి ఉండాల్సింది. కానీ పూరి ఎప్పుడూ చెప్పే మాదిరే వారం రెండు వారాల్లో స్క్రిప్టు రాసేశాడో ఏమో తెలియదు కానీ.. చాలా సిల్లీగా అనిపించేలా ఈ పాయింట్ ను డీల్ చేయడంతో ‘ఇస్మార్ట్ శంకర్’ తేలిపోయింది. ఈ పాయింట్ సంగతి పక్కన పెడితే.. మర్డర్ మిస్టరీ చుట్టూ నడిచే ఎపిసోడ్ అయినా బాగుందా అంటే అదీ లేదు. దీనికి ఇచ్చిన బిల్డప్ చూస్తే ఏదో ఊహించుకుంటాం. కానీ చివరికి అసలు విషయం తెలిసి నిట్టూరుస్తాం. ‘గూఢచారి’ - ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్స్ వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి మిస్టరీతో ప్రేక్షకుల్ని మెప్పించాలని పూరి ఎలా అనుకున్నాడో మరి?

కథాకథనాల గురించి పక్కన పెట్టేస్తే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టరైైజేషన్.. అందులో రామ్ ఎనర్జీ.. అక్కడక్కడా పూరి మార్కు డైలాగ్స్ మాత్రం సినిమాలో మెప్పిస్తాయి. ప్రథమార్ధంలో శంకర్ క్యారెక్టర్ వినోదం పంచుతుంది. మంచి ఊపు తెచ్చేలా సాగిన పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. పాటల్లో రామ్ ఎనర్జీ.. డ్యాన్సులు ఉత్సాహం నింపుతాయి. తన బుర్ర షేక్ అయినపుడు రామ్ షాకయ్యే తీరు.. చెప్పే డైలాగులు కొన్ని భలేగా అనిపిస్తాయి. రామ్-పూరిల కెమిస్ట్రీ ఇక్కడ బాగా వర్కవుట్ అయింది. యూత్ కు కనెక్టయ్యే కొన్ని అగ్రెసివ్ సీన్లు ప్రధమార్ధంలో ఒక మోస్తరుగా టైంపాస్ చేయిస్తాయి. కానీ ద్వితీయార్ధంలో కథ మీదే సినిమాను నడిపించాల్సి రావడంతో పూరి తడబడ్డాడు. తనకు నప్పని కథను ఆయన సరిగా డీల్ చేయలేకపోయాడు. కమర్షియల్‌ స్టయిల్లో ఈ కథను చెప్పబోయి ఎటూ కాకుండా తయారు చేశాడు. ఇక హీరో తన ప్రేయసి కోల్పోయి వేదన అనుభవిస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలతో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ హీరో జ్ఞాపకాల్లో ఎక్కడా ‘లస్ట్’ తప్ప ‘లవ్’ అనేది కనిపించకపోవడంతో వాటితో కనెక్ట్ కావడం కష్టమే. పతాక సన్నివేశంలో మాస్ కు ఎమోషనల్ హై ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. అందులో కొత్తదనం ఏమీ కనిపించదు.

ఇక సినిమాలో తెలంగాణ భాష, యాసతో పూరి రాసిన డైలాగులు.. వాటిని రామ్ పలికిన విధానం కృత్రిమంగా, కృతకంగా అనిపిస్తాయి. అందులో సహజత్వం లోపించింది. ఒక తెలంగాణ కుర్రాడు సహజంగా మాట్లాడితే ఉండే ఫ్లో సినిమాలో కనిపించలేదు. ఆగి ఆగి ఆ డైలాగులు చెబుతుంటే ఏదో అప్పజెబుతున్నట్లే అనిపిస్తుంది. దీనికి తోడు ఒకటే రీసౌండ్లతో చెవుల తుప్పు వదిలించేశారు రామ్-పూరి. ఓవరాల్ గా చూస్తే మాస్ ఆడియన్స్ ఇస్మార్ట్ శంకర్ చేసే హంగామాకు కొంత మేర కనెక్ట్ అవ్వొచ్చేమో కానీ.. సగటు ప్రేక్షకుడికి ఇది రుచించడం కష్టమే.

నటీనటులు:

రామ్ చేసిన మాస్ క్యారెక్టర్లలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అందరూ రామ్ ఎనర్జీ గురించి మాట్లాడేవాళ్లే కానీ.. దాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీయలేదనే చెప్పాలి. పూరి మాత్రం దాదాపుగా రామ్ ఎనర్జీనంతా వాడేశాడు. శంకర్ పాత్రలో రామ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్లాంగ్ అంత సహజంగా అనిపించకపోవడం వల్ల మొదట్లో ఈ పాత్రకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. తర్వాత రామ్ తన ఎనర్జీతో పాత్రను లాక్కొచ్చేశాడు. ఇక హీరోయిన్లు ఇద్దరూ అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ విషయంలో ఇద్దరికీ సమాన మార్కులు పడతాయి. వరంగల్ అమ్మాయిగా నభా చేసిన పాత్ర ఇరిటేట్ చేస్తుంది. తెలంగాణ యాసతో ఆ పాత్రకు రాసిన డైలాగులు మరీ కృత్రిమంగా ఉన్నాయి. సత్యదేవ్ టాలెంటుకు తగ్గ పాత్ర ఇందులో లభించలేదు. క్యామియో తరహా పాత్రలో అతను తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం లేకపోయింది. షాయాజీ షిండే పాత్ర రొటీన్. ఆశిష్ విద్యార్థి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నట్లు కనిపించాడు. మెయిన్ విలన్ గా కనిపించిన నటుడి సంగతీ అంతే.

సాంకేతికవర్గం:

సినిమాలో ఇది మణిశర్మ పాట అనిపించే సాంగ్స్ ఏవీ లేవు. కానీ ఈ సినిమాకు సూటయ్యే రెండు మూడు పాటలతో మాస్ ప్రేక్షకుల్లో ఊపు తీసుకురాగలిగాడాయన. టైటిల్ సాంగ్.. ధిమాక్ కరాబ్.. బోనాల పాటలు మాస్ ను ఊపేస్తాయి. హీరోయిన్లతో వచ్చే రొమాంటిక్ సాంగ్స్ మామూలుగానే అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ థీమ్.. పతాక సన్నివేశంతో పాటు హీరోయిజం ఎలివేటయ్యే కొన్ని సీన్లలో ఆర్ఆర్ ఊపునిస్తుంది. ఇదంతా ఓకే అయినప్పటికీ ఒకప్పటి మణిశర్మ స్థాయిలో అయితే ఔట్ పుట్ లేదనే చెప్పాలి. రాజ్ తోట ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ లో క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక పూరి విషయానికొస్తే.. కథ విషయంలో ఆయన మార్పు దిశగా ఒక అడుగు వేశారు. కానీ ఇది మనం డీల్ చేసే కథ కాదు.. అయినా ట్రై చేసి చేద్దాం అని అన్యమనస్కంగా ఏదో లాగించేసినట్లుగా అనిపించింది. స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద మైనస్. డైలాగుల విషయంలో మాత్రం కొన్ని మెరుపులు చూపించాడు పూరి. కానీ లవ్ పేరుతో లస్ట్ మాత్రమే చూపించడం.. ట్రెండ్ పేరుతో డైలాగులన్నింటినీ బూతులతో నింపేయడం గురించి పూరి ఆలోచించాలి. స్క్రిప్టు విషయంలో ఎంతో కసరత్తు చేస్తే తప్ప పూరి మళ్లీ ట్రాక్ లోకి రావడం కష్టమే అని ‘ఇస్మార్ట్ శంకర్’ రుజువు చేసింది.

చివరగా: ఇస్మార్ట్ శంకర్.. మాస్ కి దోస్త్

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre