Begin typing your search above and press return to search.

ఇది నిజమా? సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా?

By:  Tupaki Desk   |   26 Sep 2021 5:30 AM GMT
ఇది నిజమా? సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడా?
X
ఆవేశంతో మాట్లాడేసే వేళ అనుకోకుండా ఉన్న నిజాన్ని ఉన్నట్లుగా పవన్ చెప్పేశారా? రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించిన కొత్త విషయాన్ని పవన్ బయటపెట్టినట్లుగా చెప్పాలి. ‘సాయి ధరమ్ తేజ్ కళ్లు తెరవకుండా కోమాలో పడి ఉన్నాడు కదా’ అంటూ పవన్ వ్యాఖ్యలతో ఆయన ఆరోగ్యంపై కొత్త ఆందోళన వ్యక్తమవుతోంది.

సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ శనివారంరాత్రి జరగటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం మీదా ఘాటుగా రియాక్టు అయిన ఆయన.. తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా పలు విమర్శలు చేశారు. సెటైర్లు వేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే మాటల మధ్యలో తేజ్ ఇంకా కళ్లు తెరవకుండా ఆసుపత్రిలో కోమాలో పడి ఉన్నాడంటూ అన్యాపదేశంగా అన్న మాట పవన్ నోటినుంచి వచ్చింది. అనుకోకుండా వచ్చినట్లుగా ఉన్న ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియా పెద్ద ఎత్తున ఫోకస్ చేయటం.. దానిపై భిన్న కథనాలు వండేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో..తేజ్ వార్తల్ని తగ్గించారు.

అయితే..ఆయన ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు చిన్నగా ఇస్తున్నారు. ఇప్పటివరకు మీడియాలో రిపోర్టు అయిన దాని ప్రకారం.. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని.. సర్జరీ జరిగిందని.. త్వరలోనే డిశ్చార్జి అవుతారని పేర్కొన్నారు. కానీ.. పవన్ తాజా మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అయితే.. తేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదన్న మాట ఇండస్ట్రీలో గాసిప్ రూపంలో వినిపిస్తోంది. దీనికి తోడు అతనికి చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి నుంచి సమాచారం పెద్దగా బయటకు రావటం లేదు.

మీడియాలోని కొన్ని సర్కిల్స్ లో తేజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నా.. ఆ విషయానికి ఉన్న సెన్సిటివిటీతో వార్తలు రావటం లేదు. దీనికి తోడు అధికారికంగా కన్ఫర్మేషన్ లేకపోవటం కూడా ఏమీ రాయలేని పరిస్థితి. తేజ్ ఎపిసోడ్ మీద మీడియా మొదట్లోచూపించిన అత్యుత్సాహం.. దానిపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు మాత్రం సంయమనాన్ని పాటిస్తోంది. ఇలాంటివేళ.. పవన్ నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసిందని చెప్పాలి. మరి.. ఇంతకాలం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందంటూ మీడియాలో వచ్చిన వార్తల మాటేంటి? అన్నదిప్పుడు కొత్త ప్రశ్నగా మారింది.