Begin typing your search above and press return to search.

‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?

By:  Tupaki Desk   |   22 Nov 2020 10:30 AM GMT
‘బిగ్ బాస్’లో అతణ్ని మ్యాచ్ చేసేవాళ్లు లేరా?
X
బిగ్ బాస్‌లో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తుంటారు కానీ.. అంతకంటే ముందు ఆ వ్యక్తో లేదంటే మరొకరో ‘రియల్ హీరో’ ఇమేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అంతకుముందు ఆ వ్యక్తిపై ఉన్న అభిప్రాయం బిగ్ బాస్‌తో మారిపోతుంటుంది. కొత్తగా అభిమానగణం పుట్టుకొస్తుంది. మెజారిటీ జనం ఆదరణ ఆ వ్యక్తి దక్కించుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ రెండో సీజన్లో కౌశల్ ఇలాగే హీరో అయిపోయాడు. తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక దశ దాటాక అతడిని వ్యతిరేకించేవారు కూడా భారీగానే తయారయ్యారు కానీ.. కౌశల్ తెచ్చుకున్న ఫాలోెయింగ్ మాత్రం అసామాన్యమైంది. గత సీజన్లో వరుణ్ సందేశ్‌కు ఈ స్థాయిలో కాకపోయినా మంచి ఫాలోయింగే వచ్చింది. ఒక దశలో అతను అందరి ఫేవరెట్‌గా ఉన్నాడు. చివరి దశలో భార్యను నిలబెట్టడానికి అతను చేసిన కొన్ని పనులు నెగెటివిటీని పెంచాయి కానీ.. లేదంటే అతనే విజేతగా నిలిచేవాడేమో.

ఇక ఈ సీజన్ విషయానికి వస్తే.. షోలో సగం వరకు ఏ ఒక్కరి ఆధిపత్యం కనిపించలేదు. పోటాపోటీగానే సాగింది పోరు. దాదాపు అరడజను మంది టైటిల్ పోటీదారులుగా కనిపించారు. కానీ ఇప్పుడు అభిజిత్ అందరినీ వెనక్కి నెట్టేసినట్లే కనిపిస్తున్నాడు. మిగతా కంటెస్టంట్లతో పోలిస్తే అతను జెన్యూన్‌గా, స్టేబుల్‌గా కనిపిస్తుండటమే అందుక్కారణం. ముఖ్యంగా అయిన దానికి కాని దానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోవడం.. ఆవేశపడిపోవడం.. ఏడ్చేయడం లాంటివి అభిజిత్‌లో కనిపించవు. తమ కుటుంబ సభ్యుల్ని కలిసినపుడు అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ అభిజిత్ మాత్రం స్థిమితంగా కనిపించారు. మిగతా సమయాల్లో అందరూ అతి చేసిన వాళ్లే. ఆవేశపడ్డవాళ్లే. నాటకీయత జోడించిన వాళ్లే. ఎమోషనల్ ప్లే కోసం ట్రై చేసిన వాళ్లే. కానీ అభిజిత్ మాత్రం ఎంతో పరిణతితో, స్థితప్రజ్ఞతతో కనిపించాడు. ఇది అతడికి ఫాలోయింగ్ పెంచింది. అమ్మాయిలకు అతను ఫేవరెట్ అయిపోయాడు. కుర్రాళ్లలో కూడా మంచి ఫాలోయింగే ఉన్నట్లుంది. తాజాగా అభిజిత్ మీద హ్యాష్ ట్యాగ్ పెడితే అది ఇండియా లెవెల్లో ట్రెండ్ అయింది. అందులో ఒక్కొక్కరి ట్వీట్లు, దాన్ని ట్రెండ్ చేసిన తీరు చూస్తే అభిజిత్‌ను మ్యాచ్ చేసేవాళ్లు ఇప్పుడు హౌస్‌లో ఇంకెవ్వరూ లేరేమో అనిపిస్తోంది. ఉన్నంతలో సోహైల్ అతడికి పోటీ ఇస్తున్నాడు.