'దృశ్యం-2' తమిళ సీక్వెల్ కు రంగం సిద్ధం అవుతోందా..??

Fri Jun 11 2021 06:00:01 GMT+0530 (IST)

Is the stage preparing for the Tamil sequel 'Drishyam-2' .. ??

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మలయాళం మూవీ 'దృశ్యం' ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దృశ్యం విజయం కేవలం మలయాళం భాషకు మాత్రమే పరిమితం కాలేదు. 2013లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దృశ్యం సినిమాను మలయాళ భాషలో జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. ఆ ఏడాది కేరళలో ఈ సినిమా అప్పట్లోనే భారీగా వసూల్ చేసిందట. దృశ్యం మొత్తం అయిదు భాషలలో విడుదలై అన్నీ బాషలలో  మంచి విజయాన్ని అందుకుంది.తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ సింహళీ(శ్రీలంక) భాషలలో రీమేక్ అయింది. అయితే తెలుగు వెర్షన్ దృశ్యంలో విక్టరీ వెంకటేష్ మీనా కలిసి నటించగా.. తమిళ వెర్షన్ లో కమల్ హాసన్ - గౌతమి ప్రధానపాత్రలలో ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా దృశ్యం సినిమాకి సీక్వెల్ గా దృశ్యం-2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం దృశ్యం సీక్వెల్ రీమేక్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో వెంకటేష్ - మీనా ప్రధానపాత్రల్లో దృశ్యం సీక్వెల్ తెరకెక్కించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ప్రస్తుతం తెలుగు వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

అయితే ఇప్పుడు తాజాగా తమిళ సీక్వెల్ రీమేక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కమల్ హాసన్ ప్రస్తుతం దృశ్యం(తమిళంలో పాపనాశం) సీక్వెల్ చేసేందుకు ఆసక్తిగానే ఉన్నాడని టాక్. కానీ ప్రస్తుతం కమల్ నటిస్తున్న ఇండియన్-2 వివాదంలో ఉండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన థ్రిల్లర్ మూవీ విక్రమ్ కంప్లీట్ కావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరి కమల్ ఈ గ్యాప్ లో దృశ్యం-2 ప్లాన్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆల్రెడీ జీతూ జోసెఫ్ మలయాళం తర్వాత తెలుగు వెర్షన్ చాలా వేగంగా పూర్తి చేసాడు. మరి ఇప్పుడు అదే దర్శకుడితో కమల్ కూడా ప్లాన్ చేయనున్నట్లు టాక్. చూడాలి మరి పాపనాశం టీమ్ మళ్లీ సీక్వెల్ కోసం రెడీ అవుతుందేమో!