RRR షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందా..?

Mon Nov 29 2021 13:32:10 GMT+0530 (IST)

Is the RRR shooting still pending

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిందని ప్రకటించిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు.అయితే RRR షూటింగ్ కు సంబంధించి ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందేంటంటే చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయిందని చిత్ర బృందం ప్రకటించినా ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉందట. రామ్ చరణ్ - అలియా భట్ లపై ప్లాన్ చేసిన ఓ పాటను చిత్రీకరించాల్సి ఉందని.. డిసెంబర్ రెండో వారంలో షూట్ చేయాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిందని అభిమానులు భావిస్తుండగా.. ఇప్పుడు తాజాగా షికారు చేస్తున్న రూమర్ ఊహించని షాక్ కు గురిచేస్తోంది. ఇదే కనుక నిజమైతే ఓవైపు పాట షూటింగ్ మరోవైపు ప్రమోషన్స్ ఏకకాలంలో నిర్వహించడమంటే RRR టీమ్ కి కాస్త కష్టమైన పనే. కాకపోతే మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి సినిమా ప్రమోషనల్ స్ట్రాటజీలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని జానాల్లో తీసుకెళ్లడానికి సరికొత్త ప్రణాళికలతో వస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన RRR పోస్టర్స్ - ఇద్దరు హీరోల టీజర్లు - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్ ను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలానే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పలు నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 'ఆర్.ఆర్.ఆర్' రూపొందుతోంది. రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్.. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.