బండ్ల గణేష్ ట్వీట్ లోని ఆంతర్యం అదేనా?

Tue Aug 16 2022 19:08:10 GMT+0530 (IST)

Is that what Bandla Ganesh tweet is all about

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వుండటం వల్ల మూడేళ్లు సినిమాలకు విరామం తీసుకున్నారు. ఆ తరువాత బ ఆలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన రీమేక్ మూవీ `వకీల్ సాబ్`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మూవీ తరువాత మళ్లీ రీమేక్ నే ఎంచుకున్నారు. మలయళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`ని రీమేక్ లో నటించారు.`భీమ్లానాయక్` పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించగా సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. రానా కీలక పాత్రలో కనిపించాడు. నిత్యామీనన్ సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా భారీ స్తాయిలో కాకపోయినా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా  ఫరవాలేదనిపించింది. దీని తరువాత పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ `హరి హర వీరమల్లు`ని పట్టాలెక్కించారు.

క్రిష్ డైరెక్షన్ లో భారీ చిత్రాల నిర్మాత ఏ.ఎం. రత్నం మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ. దాయాకర్ రావు సహకారంతో ప్రారంభించారు. కరోనా ముందు మొదలైన ఈ మూవీ ఇప్పటికీ అదే స్టేజ్ లో వుంది. పవన్ పొలిటికల్ వ్యవహారాల్లో బిజీగా వుండటం వల్ల ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. దీనితో పాటు తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన `వినోదాయ సితం`ని కూడా రీమేక్ చేయబోతున్నారు.

అంతా రెడీ కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే వుంది. ఇటీవల వైరల్ ఫీవర్ రావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ `భవదీయుడు భగత్ సింగ్` ని ఎప్పుడు ప్రారంభిస్తాడన్న దాంట్లో క్లారిటీ లేదు. ఇదిలా వుంటే బండ్ల గణేష్ తాజాగా పవన్ పై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఓ అభిమాని `బండ్ల గణేష్ అన్న పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడు  ఒక్కసారి కొంచెం క్లారిటీ ఇవ్వు అన్న అసలు ఉందా? లేదా? అర్థం అవ్వడం లేదు అన్న` అంటూ బండ్ల గణేష్ కు ట్వీట్ చేశాడు.  
 
దీనిపై స్పందించిన బండ్ల గణేష్ .. ఆయన స్థానం వేరు.. స్థాయి వేరు అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. `మనది నిజమైన అభిమానం అయితే మనం నిజంగా ఆయనని ప్రేమిస్తే ఆయన చేయబోతున్న కార్యక్రమానికి శుభం కలగాలని కోరుకుందాం. సినిమా వ్యాపారం ఆయన్ని దయచేసి ఇబ్బంది పెట్టకూడదు.. ఇది మన బాధ్యత ఆయన స్థానం వేరు ఆయన స్థాయి వేరు` అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఇకపై పవన్ తనతో సినిమా చేయడు.. ఆయన స్థాయి స్థానం వేరని సంబోధించాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని బండ్ల గణేష్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే అది కుదరడం లేదు. కనీసం పవన్ వద్దకు బండ్ల వెళ్లడానికి కూడా వీలు పడటం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆ కారణంగానే బండ్ల గణేష్ గత కొన్ని రోజులుగా వేదాంత ధోరణిలో ట్వీట్ లు పెడుతూ వసతున్నారని ఇన్ సైడ్ టాక్. అయితే నెటిజన్ లు మాత్రం బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తన సినిమాల గురించేనా?  లేక నిర్మాణంలో వున్న సినిమాల గురించి కూడానా? అంటూ కామెంట్ ల చేస్తున్నారు.