Begin typing your search above and press return to search.

మా ఎన్నిక‌లు.. ప్ర‌కాష్ రాజ్ కి ఆ ఒక్క‌టి మైన‌స్?

By:  Tupaki Desk   |   23 Jun 2021 4:30 AM GMT
మా ఎన్నిక‌లు.. ప్ర‌కాష్ రాజ్ కి ఆ ఒక్క‌టి మైన‌స్?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత రెండు సీజ‌న్ల‌లో అధ్య‌క్షుల న‌డుమ‌ వ‌ర్గ‌విభేధాలు `మా` ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించాయ‌నే భావ‌న నెల‌కొంది. అందుకే ఇప్పుడు కొత్త‌గా ఎన్నిక‌య్యే అధ్య‌క్షుడు ప్ర‌తిష్ఠాత్మ‌క మా అసోసియేష‌న్ హుందాత‌నాన్ని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. దానికి తోడు ఆర్టిస్టుల సంఘానికి సొంత భ‌వంతి నిర్మాణం ఎప్ప‌టి నుంచో పెండింగులో ఉండ‌డంతో ఇక‌పై రాబోయే అధ్య‌క్షుడి బుద్ధి కుశ‌ల‌త గురించి అంద‌రూ సమాలోచ‌న‌లు చేసేందుకు ఆస్కారం ఉంది. ప‌ని త‌క్కువ హ‌డావుడి ఎక్కువ కాకుండా ప‌నులు స‌మ‌ర్థంగా చేయ‌గ‌లిగే అధ్య‌క్షుడి అవ‌స‌రం ఇప్పుడు స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

2021-22 సీజ‌న్ కి `మా` ఎన్నిక‌లకు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య ఈసారి పోటీ నెల‌కొంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారు మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దాదాపు 850 మంది ఆర్టిస్టులు ఉన్న అతి పెద్ద సంఘంలో ఎవ‌రికి ఎంత మ‌ద్ధ‌తు ఉండ‌నుంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే మంచు విష్ణు కు సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు వ‌ర్గాల నుంచి మ‌ద్ధ‌తు ల‌భించింది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్ మ‌ద్ధ‌తు విష్ణుకి ఉంది. ఇవ‌న్నీ అత‌డి బ‌లాలు కాగా.. ప్ర‌కాష్ రాజ్ కి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు ఉంది. ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడు కావాల‌ని స్ప‌ష్ఠ‌మైన సంకేతాలు మెగా కాంపౌండ్ నుంచి అందాయి.

మా ఎన్నిక‌ల వేడి మూడు నెల‌లుగా అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతోంద‌న్న టాక్ కూడా ఉంది. ప్ర‌కాష్ రాజ్ చాలా ముందే మెగా మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక‌పోతే సీనియ‌ర్ న‌రేష్ వైపు నుంచి త‌న మ‌ద్ధ‌తుగా నిలిచిన 200 ఓట్లు విష్ణుకి ప్ల‌స్ కానున్నాయ‌ని విశ్లేషిస్తుండగా .. మిగ‌తా 600 మంది ఆర్టిస్టుల ఎవ‌రి వైపు ఉంటారు అన్న‌ది ఆస‌క్తిగా మారింది. ప్ర‌కాష్ రాజ్ కి ఎంద‌రు మ‌ద్ధ‌తునిస్తారు? అన్న‌ది చూడాలి.

నిజానికి ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ కేట‌గిరీ. అలాగే రిజ‌ర్వుడ్ ప‌ర్స‌నాలిటీ అని ఆయ‌న‌కు షార్ట్ టెంప‌ర్ అని బ్యాడ్ టాక్ ఉంది. దీనివ‌ల్ల అత‌డికి ఆర్టిస్టుల మ‌ద్ధ‌తు ఉండ‌ద‌ని కూడా ఒక సెక్ష‌న్ ప్ర‌చారం చేస్తోంది. అయితే త‌న‌లోని లోటుపాట్ల‌ను స‌రి చేసుకుని ప్ర‌కాష్ రాజ్ ఈ ఎన్నిక‌ల్లో అంద‌రి మ‌ద్ధ‌తును కూడ‌గ‌డ‌తారా లేదా చూడాలి. అత‌డు ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మెగా కాంపౌండ్ ని ప్ర‌స‌న్నం చేసుకునే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల్ని అమ‌లు చేశారు. అది అత‌డికి క‌లిసొచ్చే అంశం కావొచ్చ‌ని భావిస్తున్నారు. మొత్తానికి మా ఎన్నిక‌లు ఈసారి కూడా ర‌స‌వ‌త్త‌రంగానే మారాయి. గెలుపోట‌ములు ఏవైనా స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కుడు క‌ల‌త‌లు లేకుండా ఈసీ స‌భ్యుల‌తో క‌లిసి ప‌ని చేసే స్వ‌భావం ఉన్న నాయ‌కుడు క‌చ్ఛితంగా అవ‌స‌రం.