ట్రెండీ టాక్: ఓటీటీలతో అందరూ హ్యాపీయేనా?

Wed Jul 21 2021 22:00:01 GMT+0530 (IST)

Is everyone happy with OTT

ఏడాదిన్నర కాలంగా సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరో.. చిన్న హీరో ఎవరైనా  ఓటీటీలపైనే ఆధారపడ్డారు. ఇక నిర్మాతలు అవకాశం ఉన్నంత వరకూ ఓటీటీలోనే రిలీజ్ చేస్తేనే ఉత్తమం అని ఇప్పటికీ భావిస్తున్నారు. ఓటీటీ రిలీజ్ విషయంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నడుమ ఓటీటీనే సేఫ్ జోన్ గా భావిస్తూ భారీ లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా బయట పడుతున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది.ఓటీటీ సంస్థలు కూడా బేరసారాలు చేస్తూ  సినిమా రేంజును బట్టి కొనడానికి ముందుకు రావడం నిర్మాతకు శుభపరిణామంగా మారింది.  ఇప్పటి వరకూ ఓటీటీలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఫలితాలు విశ్లేషిస్తే... మొదటగా నేచురల్ స్టార్ నాని నటించిన `వి`.. అటుపై `నిశ్శబ్ధం`..  నిన్నటి `నారప్ప`  ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి.

పెద్ద చిత్రాలు కావడంతో ఓటీటీలు మంచి రేటుకే వీటిని కొనుగోలు చేసాయి. కానీ ఇవే సినిమాలు థియేటర్లో రిలీజ్ చేస్తే భారీగా నష్టాలు తెచ్చేవేమో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు బయ్యర్లు అంతా నష్టపోయేవారనేది కొందరి వాదన. ఓ రకంగా  నిర్మాతలు ఓటీటీలకు అమ్ముకోవడం వల్ల సేఫ్ జోన్ లో ఉన్నారన్న ఓ గుసగుస  వినిపిస్తోంది. మరి ఓటీటీ లు పెట్టిన పెట్టుబడి రిటర్స్న్ ఎలా ఉన్నాయి? ఓటీటీలకు వచ్చిన లాభాలు ఎలా ఉన్నాయి? నష్టాలు ఎలా ఉన్నాయి ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

తెలంగాణ ఛాంబర్ హెచ్చరిక భేఖాతరు

కరోనా వైరస్ మహమ్మారీ ఇప్పటికి రెండు సార్లు వైరస్ విజృంభించి అతలాకుతలం చేసింది. మూడో వేవ్ వస్తుందని భయపెట్టేస్తున్న తరుణంలో నిర్మాతలు ఓటీటీలకు సినిమాలను అమ్ముకుంటున్నారు.

సెకండ్ వేవ్ శాంతించినా ఇంకా థియేట్రికల్ రిలీజ్ లకు ఎవరూ ముందుకు రావడం లేదు. పలువురు నిర్మాతలు తమ సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకునేందుకు రెడీ అవ్వడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. థియేటర్ల రంగాన్ని కాపాడాలంటే నిర్మాతలు సంయమనం పాటించాలని థియేటర్లలో మాత్రమే తమ సినిమాల్ని రిలీజ్ చేయాలని తెలంగాణ ఛాంబర్ ఇంతకుముందు కోరింది. అక్టోబర్ చివరి వరకూ నిర్మాతలు వేచి చూడాలని ఒకవేళ ఓటీటీల్లో రిలీజ్ చేస్తే చర్చలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది కూడా. కానీ దానిని ఖాతరు చేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. చాలామంది నిర్మాతలు ఓటీటీ సంస్థలతో బేరసారాలు సాగిస్తున్నారన్న గుసగుసలు రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు ఇటీవల నారప్ప చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశారు. తదుపరి దృశ్యం 2ని ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తారని సమాచారం.

నిర్మాతకు హక్కు ఉంటుందన్న డి.సురేష్ బాబు

నిజానికి థియేటర్లలో రిలీజ్ చేసి సినిమాని కిల్ చేయడం కంటే ఓటీటీలకు అమ్ముకోవడమే ఉత్తమమని డి.సురేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే కోట్లు పెట్టిన నిర్మాతకు ఏ వేదికపై అయినా తమ సినిమాని రిలీజ్ చేసుకునే హక్కు ఉంటుందని అన్నారు. మహమ్మారీ వల్ల పరిస్థితి తారుమారైంది. ఓటీటీ రిలీజ్ లను ఆపలేని సన్నివేశం ఉందని సురేష్ బాబు అన్నారు.