Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ సొంత డబ్బా ఎక్కువైందా..?

By:  Tupaki Desk   |   8 Aug 2022 7:30 AM GMT
విజయ్ దేవరకొండ సొంత డబ్బా ఎక్కువైందా..?
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయిన విజయ్.. తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో వారికి బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు 'లైగర్' చిత్రంతో ఏకంగా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. మూవీ ప్రమోషన్స్ లో అతని స్పీచులు చూసి VD కి సొంత డబ్బా ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమాలు ఎలా ఉన్నా.. ప్రమోషన్స్‌ టైమ్ లో విజయ్ దేవరకొండ కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు 'లైగర్' ప్రచార కార్యక్రమాల్లోనూ అదే జరుగుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'నాకు ఈరోజు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు.. ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్ కే ఈ రచ్చ ఏందిరా నాయనా' అని అభిమానులను ఉద్దేశిస్తూ వీడీ మాట్లాడారు.

డ్యాన్స్ అంటే చిరాకు అని.. అయినా సరే 'లైగర్' లో అంత డ్యాన్స్ చేశానంటే అభిమానులు గర్వంగా ఫీల్ అవ్వాలని.. ఫుల్ ఎంజాయ్ చేయాలనే అని విజయ్ అన్నారు. ఆగస్టు 25న ప్రతి థియేటర్ నిండిపోవాలని.. ఆ రోజు ఇండియా మొత్తం షేక్ అయిపోతుందని వీడీ ధీమా వ్యక్తం చేశారు. అయితే విజయ్ కామెంట్స్ పరోక్షంగా టాలీవుడ్ లోని నెపోటీజమ్ హీరోలను టార్గెట్ చేసేలా ఉన్నాయనే కొత్త చర్చ మొదలైంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు విమర్శించారు కూడా.

తన కోసం వచ్చిన వందలాది మందిని చూసేసరికి సంతోషంలో.. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ని కలిసిన ఉత్సాహంతో అలా మాట్లాడి ఉంటారని కొందరు అభిప్రాయపడ్డారు. అలా అని సర్దిచెప్పుకునేలోపే.. 'అయ్యా తాత ఎవ్వడ్ తెల్వదు' అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేయడం కాంట్రవర్సీకి మరింత ఆజ్యం పోసినట్లైంది.

అలానే 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో విజయ్ దేవరకొండ బోల్డ్ సమాధానాలు కూడా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాకపోతే 'లైగర్' చిత్రాన్ని ప్రమోట్ చేసే క్రమంలో నిర్మాత కరణ్ జోహార్ ఇలా ప్లాన్ చేసి ఉంటారనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాని ఆపడానికి కొందరు ట్రై చేసారని.. ఇండస్ట్రీలో ఇలాంటి డ్రామాలు పాలిటిక్స్ చాలా ఉంటాయని.. వాళ్లందరికీ వాట్ లగా దేంగే అనే స్పిరిట్ తో ఈ సినిమా చేశానని విజయ్ వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా నాలో ఎంతో ఫైర్ ఉందని.. అదంతా స్క్రీన్ మీద చూస్తారంటూ వీడీ చెబుతూ వస్తున్నారు. అయితే ఇదంతా చూసిన నెటిజన్లు మాత్రం అతను సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలంటే మంచి కంటెంట్ తో వెళ్లాలని.. ఈ విధంగా వచ్చే క్రేజ్ ఏమాత్రం నిలబడదని అంటున్నారు. దీనికి VD ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.

ఏ హీరో అయినా తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసే దాంట్లో తప్పేముందని అంటున్నారు. తన సినిమా జనాల్లోకి వెళ్లడానికి.. సోషల్ మీడియాలో హైప్ తెచ్చుకోడానికి అలా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడని సమర్థిస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి.. తన గురించి తాను ప్రమోట్ చేసుకోవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి విజయ్ కెరీర్ లో రికార్డులు బద్దలుకొట్టి సినిమాలేవీ లేవు. 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం' మినహా పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఇంకేమీ లేవు. ఇక లవ్ స్టోరీస్ చేయను అంటూ స్టేటమెంట్స్ ఇస్తూ రెండేళ్ల క్రితం చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. అందుకే ఇప్పుడు 'లైగర్' సినిమాపై విజయ్ భారీ ఆశలే పెట్టుకొని ఉన్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే పాన్ ఇండియా వైడ్ మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నాడు.

అయితే విజయ్ దేవరకొండ కెరీర్ సాఫీగా సాగాలంటే తన ఫ్యాన్స్ తోపాటుగా ఇతర హీరోల అభిమానుల సపోర్ట్ కూడా అవసరం. యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ ఒక్కసారి మిగతా హీరోల అభిమానుల దృష్టిలో నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని.. అందుకే అలాంటి వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇప్పటికైతే 'లైగర్' చుట్టూ మంచి బజ్ క్రియేట్ అయింది. ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై ఆసక్తిని కలిగించాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం VD సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశముంది. మరి 'ఆగ్ లగా దేంగే' అంటూ వెళ్తున్న రౌడీ హీరోకి ఎలాంటి సక్సెస్ అందుతుందో చూడాలి.

'లైగర్' చిత్రాన్ని ఆగస్టు 25న తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత విజయ్ దేవరకొండ 'ఖుషీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటుగా 'జనగణమ' (JGM) వంటి మరో పాన్ ఇండియా మూవీతో రానున్న సంగతి తెలిసిందే.