ఈమాత్రం దానికి 3డి ఎందుకు వాడారో ?

Sat May 25 2019 11:46:00 GMT+0530 (IST)

Anjali Lisaa Fails To Impress

నిన్న ఏ మాత్రం అంచనాలు లేకుండా సైలెంట్ గా మొదటి త్రీడి హారర్ తెలుగు సినిమా ట్యాగ్ తో అంజలి నటించిన లీసా విడుదలైంది. పబ్లిసిటీలో పదే పదే త్రిడి అని హై లైట్ చేయడంతో హారర్ ప్రియులు ఓసారైనా చూడొచ్చనే ఉద్దేశంతో ఓ లుక్ వేసే ప్రయత్నం అయితే చేశారు. తీరా చూస్తే ఇందులో అందులో అంత చెప్పుకోదగ్గ విషయం లేకపోవడంతో ఉసురుమంటున్నారు.తన తల్లికి రెండో పెళ్లి చేసి యుఎస్ కు వెళ్లిపోవాలనుకున్న లీసాకు అమ్మమ్మ ఊళ్ళో ఎదురైన విచిత్ర భయానక సంఘటనల సమాహారమే ఈ సినిమా. పాయింట్ లో కాని ట్రీట్మెంట్ లో ఎక్కడా కొత్తదనం కాని వైవిధ్యం కాని కనిపించదు. రొటీన్ హారర్ చిత్రాల మాదిరే సాగడం ఇందులో ప్రధాన లోటు. పైగా బ్రహ్మానందం సహాయం తీసుకుని ఇరికించిన కామెడీ ట్రాక్ పండలేదు సరికదా ఇబ్బంది పెట్టింది

చూశాక కలిగే సందేహం ఒక్కటే. ఈ మాత్రం దానికి త్రీడి టెక్నాలజీ వాడి అదనంగా ధియేటర్లో ఆ గ్లాసుల కోసం ముప్పై రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టించారా అని. మేకింగ్ లో కాని విజువల్ ఎఫెక్ట్స్ లో కాని ఎక్కడా త్రీడి స్థాయి లేకపోవడంతో ఇదంతా వృధా ప్రయాసగానే తోస్తుంది. ఉన్నంతలో హీరొయిన్ అంజలి తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేసినా దర్శకుడు రాజు విశ్వనాథ్ టేకింగ్ లోపాల వల్ల అదంతా వృధా అయిపోయింది. సంతోష్ దయనిది బ్యాక్ స్కోర్ కూడా అంతంత మాత్రమే. మొత్తానికి హార్డ్ కోర్ హారర్ మూవీ లవర్స్ ని తప్ప లీసా మిగిలినవాళ్ళను మెప్పించడం కష్టమే అని తేలిపోయింది.