సీత ఈ హాలీవుడ్ మూవీకి రీమేక్!?

Sat May 25 2019 12:16:08 GMT+0530 (IST)

Is Sita Movie Copy From Rain Man Movie

టాలీవుడ్ లో రిలీజైన చాలా సినిమాలకు కాపీ మరక అంటడం చూస్తున్నదే. అయితే ఇటీవల కొంత మేర ఒరిజినల్ కంటెంట్ పరిశ్రమకు జీవం పోస్తోంది. శివ నిర్వాణ- మజిలీ.. గౌతమ్ తిన్ననూరి - జెర్సీ  చిత్రాలు అందుకు ఎగ్జాంపుల్. ఒక దర్శకరచయిత తనకు తానుగా సృజించే ఒరిజినల్ కథ- స్క్రిప్టుతో సినిమా తీస్తే అందులో ఉండే మజాను ఆడియెన్ సంపూర్ణంగా ఆస్వాధించగలరు. అలా కాకుండా అప్పటికే వచ్చేసిన ఏదైనా సినిమా స్ఫూర్తితో లేదా ఆ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ స్ఫూర్తితో సినిమా తీస్తే ప్రేక్షకులు వందశాతం ఆస్వాధించడం అన్నది కుదరదు. ఎందుకంటే ఫలానా సినిమాలో చూసేసినదే కదా? అన్న సందిగ్ధత ఆడియెన్ ని సినిమా చూస్తున్నంత సేపూ వెంటాడుతుంది. మన దర్శకనిర్మాతలు రెగ్యులర్ గా ఫిర్యాదు చేసే కామన్ ఎలిమెంట్ కథలు దొరకడం లేదన్నది. అందుకే ఇరుగు పొరుగున హిట్టయిన సినిమా కథల్ని కొనుక్కోవడం.. వాటి రీమేక్ హక్కుల్ని ఛేజిక్కించుకోవడం చేస్తున్నారు. అలా కాకుండా కొందరు హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని కథలు రాయడం ఓ రకంగా చౌర్యం లాంటిదేనని కాపీ రైట్ యాక్ట్ చెబుతోంది.ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోంది? అంటే తాజాగా రిలీజైన `తేజ - బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్` కాంబో మూవీ `సీత`పైనా ఇలాంటి డిస్కషన్ మీడియాలో సాగుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పోషించిన అమాయకుడు పాత్రకు ఓ హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి పొందారని మాట్లాడుకుంటున్నారంతా. 1988లో ప్రఖ్యాత దర్శకుడు బ్యారీ లెవిన్సన్ తెరకెక్కించిన అమెరికన్ డ్రామా `రెయిన్ మ్యాన్` ఆధారంగా అతడి పాత్రను డిజైన్ చేశారని చెబుతున్నారు. ఆ సినిమాలో దస్తిన్ హాఫ్ మేన్ రోల్ తో సీత చిత్రంలో బెల్లంకొండ రోల్ పోలిక ఉందని విశ్లేషిస్తున్నారు. తేజ నిజంగానే ఆ చిత్రం నుంచి స్ఫూర్తి పొందారా?  లేక ఒరిజినల్ థాట్ ప్రాసెస్ లో ఈ పాత్రను క్రియేట్ చేశారా? అన్నది ఆయనే చెప్పాల్సి ఉంటుంది.

`రెయిన్ మ్యాన్` చిత్రంలో టామ్ క్రూజ్ - దస్తిన్ హాఫ్ మాన్ అన్నదమ్ములుగా కనిపిస్తారు. ఆ ఇద్దరూ మల్టీ మిలియనీర్ కుమారులు. టామ్ క్రూజు స్వార్థపరుడైన బిజినెస్ మేన్. అయితే మల్టీమిలియనీర్ తండ్రి చనిపోతూ ఆస్తి మొత్తం టామ్ కి కాకుండా వేరొక కొడుకు(హాఫ్ మేన్)కి రాసి పోతారు. ఆ తర్వాత ఆ అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది? అన్నది ఎంతో కామెడీ సెటైరికల్ గా చిత్రాన్ని రూపొందించారు. 61వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం-ఉత్తమ నటుడు (హాఫ్ మేన్)- ఉత్తమ దర్శకుడు- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. 1988లో హైయ్యస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. అందులో హాఫ్ మాన్ రోల్ కాస్తంత అమాయకత్వం .. ఇన్ ఫీరియారిటీ తరహాలో ఆటిజం సమస్య ఉన్న కుర్రాడి తరహాలో సాగుతుంది. అతడి నటనకు ఆస్కార్ తలొంచింది. ఇంచుమించు అవే లక్షణాలు కాకపోయినా అమాయకత్వం అన్న పాయింట్ తో కాస్త అటూ ఇటూగా బెల్లంకొండ శ్రీను రోల్ కి ఆపాదించారని చెబుతున్నారు. అయితే ఆస్కార్ రోల్ నుంచే స్ఫూర్తి పొంది ఇక్కడ తుస్సుమనిపించడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ ఆరోపణలపై తేజ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.