తగ్గేదిలే.. మాస్ రాజా డిమాండ్ చేస్తున్నారా?

Fri May 13 2022 05:00:02 GMT+0530 (IST)

Is Raviteja Demanding on Remuneration?

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. ఇదే సూత్రాన్ని చాలా మంది పాటిస్తుంటారు. తమ స్టార్ వున్నప్పుడే తమకున్న డిమాండ్ ని బట్టి వసూలు చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తుంటారు. ఇప్పడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత ఏడాదితో 'క్రాక్' సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ అదే ఊపుని కొనసాగిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్రల్ ఇచ్చేశారు. గతంలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక చిత్రాలు చేస్తుండటం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఈ ఏడాది రవితేజ మొత్తం ఐదు సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఒకటి కీలక అతిథి పాత్ర. నాలుగు సినిమాలు హీరోగా చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు చిత్రాలు సెట్స్ పై చిత్రీకరణ దశలో వున్నాయి. శరత్ మండవ డైరెక్షన్ లో చేస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ మూవీని జూన్ 17న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదిలా వుంటే మాస్ మహారాజా సినిమా సినిమాకు తన పారితోషికాన్ని పెంచేస్తూ భారీగా డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో గత ఏడాది రవితేజ చేసిన చిత్రం 'క్రాక్'.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మాస్ రాజాని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా వరకు 12 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటూ వచ్చిన రవితేజ 'క్రాక్' హిట్ తో ఒక్కసారిగా తన పారితోషికాన్ని 15 కోట్లకు పెంచేశారట.

ఆ తరువాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఆఫర్లు తలుపు తట్టడంతో 15 కోట్లని కాస్తా 17కు పెంచేసినట్టుగా తెలిసింది. ఈ ఏడాది 'ఖిలాడీ' సినిమాతో బిగ్ ఫ్లాప్ ని సొంతం చేసుకున్నా ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరగడంతో తాజాగా తన రెమ్యునరేషన్ ని 20 కోట్లకు పెంచేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా ఇంతగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం వుందని తెలిసింది. రవితేజ నటించిన చిత్రాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ లో 20 నుంచి 25 కోట్ల వరకు వస్తోందట.

ఆ కారణంగానే రవితేజ తన పారితోషికాన్ని 17 కోట్ల నుంచి తాజాగా 20 కోట్లకు పెంచేసినట్టుగా సైడ్ టాక్. ఆ కారణంగానే మెగాస్టార్ చిత్రానికి కేవలం గెస్ట్ పాత్ర కోసం 15 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే మాస్ రాజా రెమ్యునరేషన్ ని 20కే అపేస్తాడా? లేక రానున్న రోజుల్లో మరింతగా పెంచేస్తాడా? అన్నది 'రామారావు ఆన్ డ్యూటి' సక్సెస్ పై ఆధారపడి వుంటుందని చెబుతున్నారు.