అదే రొటీన్ సినిమాను నమ్ముకున్న మాస్ రాజా!

Sat Feb 22 2020 12:15:05 GMT+0530 (IST)

Is Ravi Teja Repeating The Same Mistake Again?

మాస్ మహారాజా రవితేజ-గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'క్రాక్' సినిమా టీజర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిన్నే విడుదల చేశారు.  రవితేజ తనదైన ఊరమాసు శైలిలో పోలీసు పాత్రలో చెలరేగిపోయినట్టుగా టీజర్ హింట్ ఇస్తోంది.  ఈ టీజర్ మాస్ రాజా అభిమానులకు కిక్కిస్తోందేమో కానీ మిగతావారు మాత్రం రొటీన్ అంటూ పెదవి విరుస్తున్నారు.ఈ సినిమా తమిళ సూపర్ హిట్ 'సేతుపతి' ని ప్రేరణగా తీసుకున్న సినిమా అని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లోనే 'సేతుపతి' సినిమాను గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా 'జయదేవ్' అనే పేరుతో రీమేక్ చేశారు.  ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.  ఇవన్నీ తెలిసి కూడా అదే కథకు రవితేజ ఒకే చెప్పడం ఆశ్చర్యంగా ఉందని టాక్ వినిపిస్తోంది.  రవితేజ ఇప్పటికే వరస ఫ్లాపులతో సతమతమవుతూ ఉన్నారు.  రవితేజ లాస్ట్ సినిమా 'డిస్కోరాజా'  సాధారణ ప్రేక్షకులకే కాదు  అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది మాస్ రాజా భాషలో చెప్పాలంటే అందరికీ జింతాత జిత జిత అయింది.  కనీసమాత్రం వసూళ్లు కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితిలో మాస్ రాజా ఇప్పటికే రీమేక్ అయిన సినిమాతో.. అదే రొటీన్ వ్యవహారం తో రావడం రిస్కేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా రవితేజ కెరీర్ ప్రస్తుతం క్లిష్టంగా ఉందనేది మాత్రం వాస్తవం.  మరో ఫ్లాప్ వస్తే కెరీర్ కోలుకోలేనంతగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సినిమాతో రవితేజ ఈ అంచనాలను తారుమారు చేసి విజయం సాధిస్తారా అనేది వేచి చూడాలి.