నెట్ ఫ్లిక్స్ కు దక్షిణాదిపై ప్రేమ పెరిగినట్టుందే!

Wed Sep 28 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

Is Netflix Focusing On Southern Content?

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సౌత్ కంటెంట్ పై ఫోకస్ పెడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో చాలా వరకు హిందీ కంటెంట్ నే నమ్ముకున్న నెట్ ఫ్లిక్స్ 'RRR' ప్రభావంతో సౌత్ కంటెంట్ పై మునుపెన్నడూ లేని విధంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దానికి నిదర్శనం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న భారీ సినిమాల ఓటీటీ హక్కుల్ని ఫ్యాన్సీ రేట్లకు సొంతం చేసుకోవడమే అని తెలుస్తోంది.'RRR'తో దక్షిణాది ప్రేక్షకుల్ని మరింతగా ఆకర్షించి ఆకట్టుకున్న నెట్ ఫ్లిక్స్ రానున్న భారీ దక్షిణాది సినిమాల స్ట్రీమింగ్ హక్కుల్ని పోటీపడీ మరీ దక్కించుకుంటుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్' దక్షిణాది భాషలతో పాటు హిందీ వెర్షన్ ఓటీటీ హక్కుల్ని కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా వుంటే తాజాగా మరో మూడు దక్షిణాది క్రేజీ సినిమాల స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకోవడం విశేషం.

ఇందులో రెండు సినిమాలు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినవే. మెగాస్టార్ నటిస్తున్న 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న దసరా సందర్భంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించగా లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించింది. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ రూ. 57 కోట్లకు సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అ మూవీతో పాటు చిరు నటిస్తున్న మరో సినిమా 'వాల్తేరు వీరయ్య'. శృతిహాసన్ హీరోయిన్ గా బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. అంతే కాకుండా మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడు.

సంక్రాంతి బరికి రెడీ అవుతున్న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని కూడా నెట్ ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు దక్కించుకుందని తెలిసింది. ఇలా ఒకే సారి ఒకే హీరోకు సబంధించిన రెండు సినిమాలకు ఈ స్థాయిలో రేట్ పలకడం విశేషం అని చెబుతున్నారు.

చియాన్ విక్రమ్ హీరోగా పా. రంజిత్ డైరెక్షన్ లోభారీ పీరియాడికల్ ప్రాజెక్ట్ ని స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. స్వాంత్య్రానికి పూర్వం కేజీఎఫ్ నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. దళితులపై ఆ టైమ్ లో జరిగిన మరణ హోమం నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న మూవీ ఇది.

ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొనడంతో ఈ ప్రాజెక్ట్ అండర్ ప్రొడక్షన్ లో వుండగానే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కుల్ని భారీ మొత్తానికి దక్కించుకుందని తెలిసింది. వరుస పరిణామాలని చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ 'RRR' తరువాత సౌత్ కంటెంట్ పై ఫోకస్ పెడుతున్నట్టుగా స్పష్టమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.