Begin typing your search above and press return to search.

ఫార్మాట్ సినిమాలు ఇంకెన్నాళ్ళు మహేష్?

By:  Tupaki Desk   |   9 April 2020 6:50 AM GMT
ఫార్మాట్ సినిమాలు ఇంకెన్నాళ్ళు మహేష్?
X
టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కొన్నేళ్ల క్రితం ఫార్మాట్ సినిమాలపైనే ఆధారపడేవారు. ప్రయోగాలకు కనీసం లక్ష కిలోమీటర్లు దూరంగా జరిగేవారు. ఎప్పుడో ఒకసారి ఎవరైనా ఒక హీరో ప్రయోగం చేసినా.."ఇక చెయ్యను బాబోయ్" అనిపించేలా ప్రేక్షకులు ఆ సినిమాను తిప్పి కొట్టేవారు. దీంతో స్టార్ హీరోలు తిరిగి మూస బాట పట్టేవారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ మొదట్లో కొన్ని ప్రయోగాత్మక సినిమాల్లో నటించారు. అయితే వాటిలో ఎక్కువ శాతం ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితి అన్నట్టుగా మిగతా స్టార్ హీరోల తరహాలోనే మసాలా సినిమాలకు జై కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మహేష్ రూటు మార్చలేదు.

అయితే ఈమధ్య ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల ఆలోచనల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. మసాలా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలు.. ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఇతర హీరోలు కూడా ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి కథా ప్రాధాన్యం ఉంటూనే కమర్షియాలిటీ ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. భారీ విజయాలు కూడా నమోదు చేస్తున్నారు. కానీ ఈ సమయంలో మాత్రం తన ఫార్ములా మసాలా సినిమాల బాట వీడక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముఖ్యంగా నిన్న విడుదలయిన అల్లు అర్జున్ కొత్త సినిమా 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒకరకంగా సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ మేకోవర్ కు భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను మహేష్ బాబు హీరోగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు ఈ మేకోవర్.. ప్రయోగాత్మక పాత్రలకు ఇష్టపడకపోవడంతోనే ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ చేతికి వచ్చింది. నిజానికి మహేష్ బాబు ఇలాంటి సినిమా కనుక చేస్తే తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. కానీ మహేష్ బాబు ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నాడని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

గత కొన్నేళ్లుగా మహేష్ బాబు తన గెటప్ లో కానీ.. లుక్స్ లో కానీ.. నటనలో కానీ ఎటువంటి వైవిధ్యం చూపించలేదు. ఒకే రకమైన మూసలో మహేష్ ఉంటున్నాడని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. నిజానికి మొదట్లో మహేష్ ప్రయోగాలు చేసినప్పుడు ప్రేక్షకులు వాటిని ఆదరించేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. కంటెంట్ బాగుంటే చాలు.. ఎటువంటి ప్రయోగాలనైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ మసాలా బాటను వీడక పోవడం చాలామందికి నిరుత్సాహం కలిగిస్తోంది. మహేష్ తన కెరీర్ లో వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకోవడం లేదని.. విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులతో పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. సందీప్ వంగా.. సుకుమార్.. విక్రమ్ కుమార్.. ఇలాంటి వారితో పని చేయడం కంటే కమర్షియల్ డైరెక్టర్లు.. నాలుగైదు నెలల్లో సినిమాలు చుట్టేసే వారితో చేసేందుకు మహేష్ ఇష్టపడుతున్నారని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇలాంటి బాటలో ఎక్కువకాలం విజయాలు దక్కవని.. మహేష్ తన రూటు మార్చక తప్పదని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.