ఇండస్ట్రీకి మళ్లీ ఏపీ ప్రభుత్వ స్ట్రోక్ తప్పదా?

Sat Oct 23 2021 13:00:02 GMT+0530 (IST)

Is Ap Sarkar Going To Give Master Stroke To Tollywood

``రాజుగారు తలుచుకుంటే వరాలు కరువా?`` .. ఇటీవలే మెగా నిర్మాత అల్లు అరవింద్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించిన ప్రసంగమిది. సరిగ్గా పవర్ స్టార్ టిక్కెట్టు రేటు పాలన అంశాలపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించిన అనంతరం అరవింద్ లైన్ లోకి వచ్చి అలా కూల్  చేసినట్లు కనిపించింది. ఇంకా ఇండస్ట్రీలో రకరకాల సమస్యల్ని ఉద్దేశించి అల్లు అరవింద్ ఆ రకంగా స్పందించారు అనుకోండి. అయితే ఎక్కడ రాజీ పడినా ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా దోచేస్తున్న టిక్కెటింగ్ వ్యవస్థపై మాత్రం  రాజీ పడే సమస్యే లేదని తాజాగా మరోసారి హింట్ కనిపిస్తోంది.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి...నాలుగు షోలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి తోడు కరోనా కూడా దాదాపు 90 శాతం అదుపులోకి వచ్చింది. కేసులు కూడా పెద్దగా  లేవు. జనాలు కూడా మాస్కులు..శానిటైజర్లని కూడా పక్కన పడేసారు. ఇలా తాత్కలికంగా కరోనా గురించి జనాలంతా మర్చిపోయారు. దీంతో సినిమా రిలీజ్ లకు అడ్డంకులు పూర్తి స్థాయిలో తొలగిపోయాయి. ఈ దసరాకి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ అయ్యాయి. రానున్నది దీపావళి..క్రిస్మస్ కూడా కొంత మంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ తర్వాత జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రధానంగా అగ్ర హీరోల మధ్య పోటీ వాతావరణంతో సినిమా రిలీజ్ కాబోతున్నాయి.

అప్పటికి అన్ని సమస్యలు అనగా టిక్కెట్ రెట్లు పెంచుకునే వెసులు బాటు కూడా ముఖ్యమంత్రి  కల్పిస్తారని నిర్మాత లు..ఎగ్జిబి టర్లు.. పంపిణీ దారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే.  అయితే ఆ ఛాన్స్ ఇప్పట్లో ఎంతమాత్రం లేదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ పై ఏపీ ప్రభుత్వం పోర్టల్ ని సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇకపై టిక్కెట్ అమ్మకాలన్నీ ఆ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ పోర్టల్ 2022 లో అందుబాటులోకి రానుందని సమాచారం. అప్పటివరకూ టిక్కెట్ రేట్లు పెంచే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఉన్న..ప్రభుత్వం నిర్ధేశించిన పాత ధరలతోనే అప్పటివరకూ అమ్మకాలు జరగాలని మరోసారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడానికి రంగం సిద్దమవుతోందిట.

ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసి బ్లాక్ దందా కొనసాగిస్తే గనుక  థియేటర్లని శాశ్వతంగా మూసేసే ఏర్పాట్లు  జరుగుతాయని హెచ్చరికలు సైతం జారీ చేయాలని ప్రభుత్వం  యోచిస్తోందట. మొత్తానికి మరోసారి ఎగ్జిబిటర్లుకు పరిశ్రమకు షాక్ లు తప్పదనే తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలతో ప్రేక్షకుడు హాయిగా బాల్కనీలో కూర్చొని సినిమా చూడగలుగుతున్నాడని సినీ ప్రియుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.  చిన్న నిర్మాతల్లో పలువురు దీనికి మద్ధతు పలుకుతున్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ శ్రేయస్కరమే కానీ దొడ్డి దారితోనే చిక్కు

ప్రభుత్వమే ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్ ని ప్రారంభించినా కొందరు దొడ్డిదారులు వెతుకుతారనే సందేహాలు సినీప్రముఖుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈమధ్య కాలంలో సినిమా ఆన్లైన్ టికెటింగ్ విధానంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ పి. ఛాంబర్ తరుపున ఏర్పాటు చేసిన సమావేశంలో  ఏ. పి ఛాంబర్ ప్రెసిడెంట్ అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ సినిమా టికెట్స్ ధరల విషయంలో థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ విధానం ఉత్తమ మైనదని ఆ విధానాన్ని అమలుచేయమని ఛాంబర్ తరుపున ఎన్నో సంవత్సరముల నుంచి గవర్నమెంట్ ను అడుగుతున్నామని అది ఇప్పుడు అమలుచేయాలని ఏ. పి. గవర్నమెంట్ నిర్ణయించడం శుభపరిణామం అని అన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న వై. యస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఛాంబర్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఛాంబర్ సెక్రటరీ జె. వి. మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే ఎ.. బి సెంటర్స్ లో చాలా థియేటర్స్ లో ఆన్లైన్ విధానం వుందని మిగతా థియేటర్స్ లో కూడా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అంతా ట్రాన్సపరెంట్ గా ఉండి ఎక్కడా వివాదాలు తలెత్తవని తెలిపారు. ఆన్లైన్ విధానం ప్రభుత్వ అదీనంలో ఉండటం తప్పు కాదని.. కానీ కలెక్షన్స్  ఎప్పటికప్పుడు థియేటర్స్ కు వచ్చేలా చేయాలనీ.. అప్పుడే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని కోరారు. పలువురు ఆన్లైన్ విధానాన్ని స్వాగత్తిస్తున్నామని.. బి- సి సెంటర్స్ టికెట్స్ రేట్స్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి కొంత పెంచితే మంచిదని అప్పుడే థియేటర్ వ్యవస్థ పదిలంగా ఉంటుందని తెలిపారు. మనకు ఏదైనా సమస్య ఉంటే గవర్నమెంట్ ను రిక్వెస్ట్ చేసి పరిష్కరించుకోవాలి కానీ దానిని వివాదం చేయడం మంచిది కాదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇకపై బ్లాక్ టికెటింగ్ అంతమైనట్టేనా?

ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్మితే బ్లాక్ టికెటింగ్ వ్యవస్థ అంతమైనట్టేనా? అని ఏపీ ఛాంబర్ సెక్రటరీ జేవీ మోహన్ గౌడ్ ని `తుపాకి` ప్రశ్నించగా.. దొంగ దారులు వెతికేవారికి దొడ్డి దారులు తెలిసిన వారికి అడ్డంకి వేయడం కష్టమేనని దానిపై ప్రభుత్వాలు ప్రతిరోజూ మానిటర్ చేయలేవని అన్నారు. కొన్ని టిక్కెట్లను మామూలుగా డోర్ వెనక నుంచి విక్రయిస్తే థియేటర్ లోనికి పంపిస్తే దానిని ప్రభుత్వ అధికారులు ప్రతిసారీ కనిపెట్టే ప్రయత్నం చేయరు కదా.. అని సందేహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు వ్యవస్థ ఇలాగే సాగిందని ఒక ఎగ్జిబిటర్ గా అనుభవంతో తెలిపారు.