అమీర్ ఖాన్ చేసిన తప్పు నిఖిల్ కు కలిసొస్తోందా?

Sat Aug 06 2022 08:00:01 GMT+0530 (IST)

Is Aamir Khan mistake coming to Nikhil

కొన్ని అనుకోకుండా జరిగే పొరపాట్లు ఆ తరువాత ఇబ్బందుల్ని కలిగిస్తుంటాయి. ఇదే మయంలో మరొకరికి కలిసొస్తుంటాయి. ఇప్పుడు నిఖిల్ నటించిన `కార్తికేయ 2` విషయంలో అదే జరుగుతోందని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ నటించిన సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో తనకు గతంలో కలిసి వచ్చిన కథకు సీక్వెల్ గా చేస్తున్న సినిమా `కార్తికేయ2`. దేవుడు నమ్మకం వంటి అంశాలని ప్రధానంగా చేసుకుని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచిన మూవీ ఇది.తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ముందు జూలై 22న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ నాగచైతన్య `థాంక్యూ` మూవీ కారణంగా అనివార్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆగస్టు 12న రిలీజ్ అని ప్రకటించారు. అయితే నితిన్ నటించిన `మాచర్ల నియోజక వర్గం` విడుదల కారణంగా మళ్లీ రిలీజ్ డేట్ ని ఆగస్టు 13కు మార్చేశారు.

రెండు దఫాలుగా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవాల్సి రావడంతో నిఖిల్ ఫీలవుతున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో నిఖిల్ సినిమా పరిస్థితి ఇలా వుంటే బాలీవుడ్ లో మాత్రం ఊహించని విధంగా వుందట. ఆగస్టు 11న అమీర్‌ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` అక్షయ్ కుమార్ నటించిన `రక్షా బంధన్` సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండిని బ్యాన్ చేయాలంటూ బాలీవుడ్ ప్రేక్షకులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

ఇదే ఇప్పడు నిఖిల్ `కార్తికేయ 2` మూవీకి కలిసొస్తోందట. 2015లో అమీర్ ఖాన్ ఓ మీడియా మీట్ లో మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగిపోతోందని ఇక్కడ నుండి వేరే దేశం వెళ్లిపోదామని తన వైఫ్ కిరణ్ అన్నారని అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు `లాల్ సింగ్ చడ్డా` మెడకు చుట్టుకున్నాయి. ఆ నాటి వ్యఖ్యలని గుర్తు చేస్తూ అమీర్ సినిమాని బాయ్ కాట్ చేయండి అంటూ నెట్టింట గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అక్షయ్ కుమార్ సినిమాకు రచయితగా వ్యవహరించిన కనికా థిల్లాన్ కారణంగా ఈ సినిమాని కూడా కొంత మంది బాయ్ కాట్ చేయమని ప్రచారం చేస్తుండటం గమనార్హం.

హిందూ మతవిశ్వాసాలపై కనిక చేసిన అనుచతి వ్యాఖ్యలని తప్పుపడుతూ ఇప్పడు ఆమె కథ అందించిన `రక్షా బంధన్` మూవీని బాయ్ కాట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వర్గాలు చాలా మంది సోషల్ మీడియా వివిధ ప్రచార సాధనాలలో సనాతన ధర్మాన్ని ప్రధాన కథా వస్తువుగా ఎంచుకున శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో రూపొందిన `కార్తికేయ2`ని మాత్రమే చూడాలని ప్రచారం చేస్తుండటం విశేషం.  

ఈ మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఇటీవల `ది కశ్మీర్ ఫైల్స్` మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అదే ఇప్పడు `కార్తికేయ2`కు బాలీవుడ్ లో బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తోందని అంతే కాకుండా అమీర్ ఖాన్ అక్షయ్ సినిమాలపై వున్న ద్వేషం ఈ మూవీకి బాలీవుడ్ లో కలిసొచ్చేలా వుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.