Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్ K' కోసం బాలీవుడ్ క్వీన్ కి ఆహ్వానం!

By:  Tupaki Desk   |   4 Dec 2021 10:39 AM GMT
ప్రాజెక్ట్ K కోసం బాలీవుడ్ క్వీన్ కి ఆహ్వానం!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనేకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారీ సినిమాలు .. భారీ విజయాలు ఆమెను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లి నిలబెట్టాయి. ఇక నటనలో తనదైన ప్రత్యేక ముద్ర ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా సిద్ధపడగలిగే సాహసం ఆమె సొంతం. ఆమెను అభిమానించేవారు .. ఆరాధించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇతర భాషలకి చెందిన స్టార్ హీరోలు .. హీరోయిన్లు సైతం ఆమె అభిమానులుగా చెప్పుకుంటూ ఉండటం విశేషం. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా ఆమె ఖాతాలో ఒక రికార్డు ఉంది.

సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో చక్రం తిప్పిన అతికొద్ది మంది కథానాయికలలో దీపిక ఒకరు. సాధారణంగా తన సినిమాల విషయంలో .. పాత్రల విషయంలో .. పారితోషికం విషయంలో షరతులు పెట్టె అవకాశం హీరోయిన్లకు ఉండదు. ఒక స్థాయికి వెళ్లిన హీరోయిన్ల విషయంలోనే అలా జరుగుతుంది. అలా డిమాండ్ చేసిన అతికొద్ది మంది కథానాయికలలో దీపిక ఒకరు. అలాంటి దీపికను ఇతర భాషల్లో చేయమని అడగడం ఒక సాహసంలాంటిదే. ఎందుకంటే పారితోషికంతో పాటు అందుకయ్యే ఖర్చును భరించడం కష్టం. అందుకు సిద్ధపడే ప్రభాస్ సినిమా 'ప్రాజెక్టు K' కోసం వైజయంతీ మూవీస్ వారు ఆమెను తీసుకున్నారు.

అయితే తాను అడిగినంత పారితోషికం ఇస్తున్నారు గనుక ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే అనలేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ .. వైజయంతీ బ్యానర్ కి గల పేరు .. 'మహానటి' వంటి అద్భుతమైన సినిమాను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ పనితీరు నచ్చడం వల్లనే ఆమె అంగీకరించింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు త్వరలో మొదలుకానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. 'వెల్ కమ్ క్వీన్' అంటూ ఈ సినిమా టీమ్ ఆమెకి పసుపు కుంకుమలు .. పూలు .. గాజులు .. పండ్లు .. పట్టుచీర పంపించారు. ఒక ఆడపడుచుగా ఆమెకి ఈ సినిమా టీమ్ ఆహ్వానం పలికింది.

ఇక ముంబై ఎయిర్ పోర్టులో హైదరాబాద్ కి బయల్దేరుతూ దీపిక కెమెరాల కన్నుకు చిక్కింది. దాంతో అంతా కూడా ఆమె నాగ్ అశ్విన్ సినిమా షూటింగులో పాల్గొనడానికి వెళుతోందని చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే 'ప్రాజెక్టు K' కోసం ఆమె రంగంలోకి దిగిపోయినట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే. అమితాబ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడని అంటున్నారు. 2023లో ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.