Begin typing your search above and press return to search.

ఇండియాలో ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ గురించి గూగుల్ చేసేవాడిని: నితిన్ ఇంటర్వ్యూ

By:  Tupaki Desk   |   9 Aug 2022 3:31 PM GMT
ఇండియాలో ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ గురించి గూగుల్ చేసేవాడిని: నితిన్ ఇంటర్వ్యూ
X
గతేడాది 'చెక్' 'రంగ్ దే' సినిమాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయిన యూత్ స్టార్ నితిన్.. 'మ్యాస్ట్రో' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం' అనే పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.

ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో 'మాచర్ల నియోజకవర్గం'.సినిమా తెరకెక్కింది. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి - కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించగా.. అంజలి స్పెషల్ డ్యాన్స్ నంబర్ లో సందడి చేయనుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి - నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మాచర్ల చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరో నితిన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...

* చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ మాస్ సినిమా చేస్తున్నారు కదా.. ఏదైనా స్ట్రాటజీ వుందా?

౼ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో వున్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్ గా చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలనే అలోచనతో 'మాచర్ల నియోజకవర్గం' చేశా. ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. పవర్ ఫుల్ రోల్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ వున్నాయి.

* మాచర్లలో వుండే కొత్తదనం ఏమిటి ?

౼ కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో వుండే కథ చాలా యూనిక్ వుంటుంది. పొలిటికల్ నేపధ్యంలో ఇది వరకు చాలా చిత్రాలు వచ్చాయి. కానీ మాచర్ల లో వుండే పాయింట్ చాలా కొత్తగా వుంటుంది. కమర్షియల్ ఫార్మెట్ లో ఉంటూనే కొత్త పాయింట్ తో వుంటుంది.

* 'మాచర్ల నియోజికవర్గం' లో మీకు ఆకట్టుకున్న పాయింట్ ఏమిటి?

౼ కథ కొత్తగా యూనిక్ గా వుంటుంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. నేను ఐఎఎస్ పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మాస్ సినిమా అయినప్పటికీ కథలో, క్యారెక్టర్ లో చాలా ఫ్రెష్ నెస్ వుంటుంది. నేను సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. ఫుల్ ఎంటర్టైమెంట్ - మంచి పాటలు, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ వున్నాయి. ఫ్యాన్స్ కి పండగలా వుంటుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి రోజు మొదటి ఆటకి నేనూ థియేటర్ కి వెళ్తా.

* ఎడిటర్ గా వున్న రాజశేఖర్ దర్శకత్వం చేయగలడనే నమ్మకం మీకు ఎలా వచ్చింది?

౼ 2017 'లై 'షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టయిల్ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నపుడు తను ఇన్ పుట్స్ కూడా బావుండేవి. ''నువ్వు డైరెక్టరైతే బావుంటుంది'' అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైయింది. కోవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాను.

* కొత్త దర్శకులతో కొన్ని ఇబ్బందులు వుంటాయి కదా.. కథ చెప్పినట్లే తీశారా?

౼ శేఖర్ ఎడిటర్ కావడం వలన షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, లెంత్ విషయంలో చాలా క్లారిటీ వుంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. శేఖర్ ఎడిటర్ కావడం వలన ఎంత కావాలో అంతే తీశాడు. దీని వలన వృధా తగ్గింది. మాచర్లలో చాలా మంది నటీనటులు వున్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. ఐతే శేఖర్ నేను అనుకున్న దానికి కంటే అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. చాలా అనుభవం వున్న దర్శకుడి లాగా తీశాడు.

* దర్శకుడు శేఖర్ మీ స్నేహితుడు కదా.. సినిమా విషయంలో మీరు ఎలాంటి ప్రత్యేక భాద్యత తీసుకున్నారు?

౼ శేఖర్ ఒక ఫీల్డ్ మార్చి మరో ఫీల్డ్ కి వస్తున్నాడు. ఇక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఆ ఫీల్డ్ కి వెళ్ళాలి. అందుకే ఈ సినిమా నాకంటే కూడా తనకే ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

* ఐఎఎస్ పాత్ర కోసం హోం వర్క్ చేయడం.. మేకోవర్ కావడం జరిగిందా?

౼ ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా హోం వర్క్ చేశారు. చాలా మంది ఐఎఎస్ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, షూటింగ్ సమయంలో ఎక్కడ హుందాగా వుండాలి.. ఎక్కడ మాస్ గా ఉండాలనేది తనే చెప్పాడు.

* 'మాచర్ల నియోజికవర్గం' కు యాధార్ధ సంఘటనల స్ఫూర్తి ఉందా? ప్రీరిలీజ్ ఈవెంట్ లో సముద్రఖని గారు రియల్ ఇన్సిడెంట్స్ అని మాట్లాడారు కదా..?

౼ లేదండీ. 'మాచర్ల నియోజికవర్గం' కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ. దర్శకుడు శేఖర్ ది గుంటూరు. మాచర్ల అనే టైటిల్ లో ఒక ఫోర్స్ వుంది. అందుకే మాచర్ల నియోజికవర్గం అని టైటిల్ పెట్టాం. సముద్రఖని గారికి శేఖర్ కథ చెప్పినపుడు.. తమిళనాడులో ఇలాంటి ఇన్సిడెంట్ వుందని సముద్రఖని గారు అన్నారు.

* కలెక్టర్ అంటే కొంచెం సాఫ్ట్ గా వుంటారు కదా..?

౼ ఐఎఎస్ అంటే క్లాస్ అనుకుంటాం. కానీ ఆ పాత్ర మాస్ గా వుంటే ఎలా వుంటుందనే కొత్త అలోచనతోనే ఫ్రెష్ గా వెళ్లాం.

* ట్రైలర్ లో మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా?

౼ ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ కామెడీ వుంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ట్రాక్ అవుట్ అండ్ అవుట్ కామెడీగా వుంటుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా ఫన్ వుంటుంది. ఊర మాస్ లా కాకుండా మాస్ కూడా క్లాస్ టచ్ తో వుంటుంది.

* మాచర్ల నియోజికవర్గం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు రిలేట్ అవుతుంది ?

౼ మాచర్ల నియోజికవర్గం ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా అంతా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యుమర్, ఫన్, మాస్, క్లాస్ అన్నీ వుంటాయి.

* క్యాథరిన్ పాత్రని సర్ప్రైజ్ గా వుంచారా?

౼ క్యాథరిన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా కీలకం. ఒక కీ పాయింట్ ఆ పాత్రలో వుంటుంది.

* మాచర్ల లో మీ పాత్రలో సవాల్ గా అనిపించిన అంశాలు?

౼ చాలా రోజుల తర్వాత చేసిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఫైట్స్, లుక్ విషయంలో కొంచెం ఎకువ శ్రద్ధ తీసుకున్నా.

* కృతి శెట్టిని స్మార్ట్ అన్నారు కదా?

౼ అవును. తన షూటింగ్ లో ప్రతీది చాలా లాజికల్ గా అడుగుతుంది. కృతి అడిగే ప్రశ్నలు చాలా స్మార్ట్ గా వుంటాయి. హీరోయిన్స్ లో అరుదైన క్యాలిటీ ఇది.

* మీ కెరీర్ లో బెస్ట్ ఫైట్స్ అన్నారు?

౼ ఇది వరకు నా చిత్రాలలో ఫైట్స్ వున్నాయి. కానీ మాచర్ల ఫైట్స్ మాత్రం చాలా స్పెషల్. పవర్ ఫుల్ - ఇంపాక్ట్ ఫుల్ - స్టయిలీష్ గా వుంటాయి. ఒకొక్క ఫైట్ ఒక్కోలా వుంటుంది. షూటింగ్ లో ఫైట్స్ అలవాటే. కానీ మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నాను. అలాగే షూటింగ్ లో గాయాలు కూడా అయ్యాయి.

* కోవిడ్ కి ముందు లాక్ చేసిన కథ కదా.. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేశారా?

౼ లేదండీ. ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి.

* ఒక హీరోగా ప్రేక్షకుల అభిరుచి ఎలా వుందని భావిస్తున్నారు?

౼ కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్ - ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం.

* మహతి స్వరసాగర్ సంగీతం గురించి ?

౼ సాగర్ నాకు మంచి మ్యూజిక్ ఇస్తాడు. మా ఇద్దరి సింక్ బావుంటుంది,. మాచర్ల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా చేశాడు. నేపధ్య సంగీతంలో మణిశర్మ గారిని మైమరపించాడు.

* మీకు ప్రొడక్షన్ వుంది.. ప్రస్తుతం షూటింగ్ బంద్ నడిస్తుంది. నిర్మాత కోణంలో ఎలా చూస్తారు?

౼ ఒక నెలలో సమస్యలకు పరిష్కారం దొరికి మళ్ళీ షూటింగులు మొదలౌతాయని ఆశిస్తున్నాను.

* 'విక్రమ్' సినిమా విషయంలో మీ సలహా వుందని నాన్నగారు చెప్పారు?

౼ సలహా అంటే.. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్ళను (నవ్వుతూ). 'విక్రమ్' చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా.. ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే అలాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా.

* ఇరవై ఏళ్ల ప్రయాణం తృప్తిగా ఉందా?

౼ ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశాను. కొన్ని అపజయాలు కూడా చూశాను. ప్రస్తుతం మంచి స్థితిలో వుండటం తృప్తిగా వుంది. ఇంకా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాలనేదే నా ప్లాన్.

* వరుస అపజయాలు వచ్చినపుడు మళ్ళీ బలంగా నిలబడాలనే స్ఫూర్తినిచ్చిందెవరు?

౼ ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగల్ చేసేవాడిని (నవ్వుతూ) అక్షయ్ కుమార్ - హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటీవ్ గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను.

* 'రాను రాను' పాట రీమిక్స్ ఆలోచన ఎవరిదీ?

౼ ఈ ఆలోచన నాదే. ఏదైనా పాట రీమిక్స్ చేద్దామని అన్నప్పుడు 'జయం' హైలెట్స్ లో ఒకటైన రానురాను పాటని మిక్స్ మిక్స్ చేద్దామని చెప్పాను. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రం లో మూడు పాటలు డ్యాన్స్ వేశాను. డ్యాన్సులన్నీ బావుంటాయి.

* మాచర్ల షూటింగ్ ఎక్కడ జరిగింది ?

౼ హైదరాబాద్ - విశాఖపట్నంలో షూట్ చేశాం. పాటల కోసం విదేశాలకు వెళ్లాం. ప్రసాద్ మురెళ్ళ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

* పాన్ ఇండియా సినిమా ఆలోచన ఉందా ?

౼ పాన్ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదని నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడే అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను.

* కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?

౼ వక్కంతం వంశీ గారితో ఒక సినిమా చేస్తున్నా.