Begin typing your search above and press return to search.

అరుదైన కోణం : అన్నగారి అభిరుచికి జోహార్ చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 AM GMT
అరుదైన కోణం : అన్నగారి అభిరుచికి జోహార్ చెప్పాల్సిందే
X
ఎన్టీయార్ అన్న మూడు అక్షరాలు తెలుగు వారి చరిత్ర ఉన్నంతవరకూ అలా అల్లుకుని ఉంటాయి. ఇందులో అతిశయోక్తి అన్నది లేదు, అలాగే అసత్యం అంతకంటే లేదు. ఎన్టీయార్ గ్రేట్ అంటే ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న దానికే అంటారు. కానీ నిజానికి ఆయనలో ఎన్నో పార్స్వాలు ఉన్నాయి. మరెన్నో కోణాలు ఉన్నాయి.

ఆయన మంచి సాహిత్యాభిలాషి. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఇక అన్న గారికి తెలుగు చెప్పిన గురువు ఎవరు అంటే కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు. ఆయన తెలుగు వారికి తొలి జ్ఞానపీఠ అవార్డుని తెచ్చిన మహా కవి. ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎన్టీయార్ తన తెలుగు భాషను మెరుగుపరచుకున్నారు. భాష మీద మమకారాన్ని పెంచుకున్నారు. సాహిత్యం మీద అభిలాషను కూడా పెంచుకున్నారు.

ఇక విశ్వనాధ వారు తెలుగు లెక్చరర్ గా ఉండగా ఎన్టీయర్ తో నాటి కళాశాలలో నాయకురాలు నాగమ్మ అన్న నాటకాన్ని ప్రదర్శింపచేశారు. ఆ నాటికలో నాగమ్మ పాత్ర వేసిన ఎన్టీయార్ మీసం తీయనని విశ్వనాధ వారి ముందే చెప్పి అలాగే నటించి శభాష్ అనిపించుకున్నారు. అలా మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీయార్ లో నటనను అలా చూసి పదును పెట్టిన వారు విశ్వనాధవారు.

ఇక ఎన్టీయార్ కి విశ్వనాధ వారు అంటే ఎంతో భక్తి. అయన సినిమా నటుడు అయ్యాక ఎక్కువగా సినిమా కార్యక్రమాలు విజయవాడలోనే జరిపేవారు. దానికి ముఖ్య అతిధిగా తన గురువుగారు ఉండాలన్న ఉద్దెశ్యమంతో అలా చేసేవారు. ఇక్కడ మరో చిత్రం ఏంటి అంటే విశ్వనాధ వారు రాసిన ఏకవీర నవలను సినిమాగా తీస్తే అందులో హీరో ఎన్టీయార్. అలా గురు శిష్యులు వెండి తెర మీద అద్భుతాన్ని ఆవిష్కరించారు.

విశ్వనాధ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డిని ఎక్కువగా ఎన్టీయార్ అభిమానించేవారు. ఆధునిక సాహిత్యం అంటే ఆయనకు మక్కువ. అందుకే సినారెను దగ్గర చేసి ఆయనతో కలసి తన సినిమాలకు సాహితీ పరిపుష్టిని కలిగించేలా చేశారు. ఇక ఎన్టీయార్ లో మంచి కధకుడు ఉన్నారు. ఆయన తీసిన సొంత సినిమాలకు కధలు అందించిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే ఎన్టీయార్ లో చిత్రకారుడు ఉన్నారు. ఆయన బొమ్మలు బాగా వేసేవారు. ఆయనకు చిత్ర లేఖనం అంటే చాలా ఇష్టం. ఆయన కళాశాల రోజులలోనే మంచి చిత్రాలు గీసి అందరి మన్ననలు అందుకున్నారు. అంతే కాదు ఆయనకు చదువుకునే వారు అంటే ఎంతో అభిమానం. ఆయన ఆ రోజుల్లో బీఏ పాస్ అయి బ్రిటిష్ వారు పెట్టిన పరీక్షలో నెగ్గి సబ్ రిజిస్టార్ గా ఉద్యోగం సంపాదించారు. వందల మంది హాజరైన ఆ పరీక్షలో కేవలం ఏడుగురు మాత్రమే సెలెక్ట్ అయితే అందులో ఎన్టీయార్ ఒకరు కావడం అంటే ఆయన ప్రతిభ ఏంటి అన్నది తెలుస్తుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఎన్టీయార్ దస్తూరీ కూడా అందంగా ఉంటుంది. ఆయన చాలా సార్లు అభిమానులకు బహిరంగ లేఖలు రాసి సంతకం కూడా చాలా అందంగా పెట్టేవారు. ఎన్టీయార్ తెలుగు అక్షరాలు ముద్దుగా ఆ లేఖలో కనిపిస్తూ ఫ్యాన్స్ నే కాదు అందరినీ మురిపించాయి. ఇక ఎన్టీయార్ కి కలాశాల రోజుల నుంచే మిత్రుడు గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన మంచి సాహిత్యకారుడు అన్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీయార్ కేవలం సినిమా నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అంతకు మించి చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు అని చెప్పాలి.