ఇంకేం కావాలే తల్లీ అంటున్న గోవిందం

Wed Jul 11 2018 18:56:10 GMT+0530 (IST)

గోవిందం ప్రేమించిన గీత ఎలా ఉంటుందో తెలియదు కానీ... ఆమె కోసం పాడిన గీతానికి మాత్రం అదుర్స్ అనే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. రాత్రికి రాత్రే ఒక మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. ఆ మార్క్ ఒక సంచలనం అనే చెప్పాలి. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... అంటూ సాగే ఆ పాటని అనంతశ్రీరామ్ రచించగా - గోపీసుందర్ స్వరపరిచారు. ఆ పాట ఒక మంచి మెలోడీగా - ప్రత్యేకమైన బాణీతో సాగుతోంది. వినగానే ఆకట్టుకొనే ఆ బాణీకి అనంతశ్రీరామ్ సాహిత్యం మరింత వన్నె తెచ్చింది. దాంతో సాంగ్ లిరికల్ వీడియో ఆన్ లైన్లో అదరగొట్టింది.చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు.  `మేడమ్ చూశారా మా బ్యాచ్ అంతా ఫీల్ అవుతున్నారు - ఇంకేం కావాలే తల్లీ?` అంటూ ట్వీట్ చేసి ఈ పాట మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. సినిమాలో మేడమ్ అంటూ వెంటపడుతుంటాడో  ఏంటో తెలియదు కానీ తన హీరోయిన్ విషయంలో చాలా గౌరవంగా  నడుచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.  ట్విట్టర్ లో ప్రతిసారీ మేడమ్ అంటూ సంబోధిస్తున్నాడు. విజయ్ దేవరకొండ - రష్మిక మండన్న జంటగా నటిస్తున్న `గీత గోవిందం` ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది.