Begin typing your search above and press return to search.

లైకా మెడ‌కు కార్మిక సంఘాల గుదిబండ‌!

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:50 AM GMT
లైకా మెడ‌కు కార్మిక సంఘాల గుదిబండ‌!
X
'ఇండియ‌న్ -2' (భార‌తీయుడు 2) సెట్స్ లో జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. చ‌నిపోయిన ముగ్గురు స‌హాయ‌కుల కుటుంబాల‌కు క‌మ‌ల్ హాస‌న్ కోటి.. చిత్ర‌ నిర్మాత‌లు 2 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించారు. ఇంగా గాయాల‌పాలైన మిగ‌తా ప‌దిమందికి లైకా ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ త‌రుపున ఆర్ధిక స‌హాయం ప్ర‌క‌టించారు. ఇక భ‌ద్ర‌త విష‌యంలో ఫెయిల‌య్యామ‌ని..ముగ్గురు ప్రాణాలు పోవ‌డానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యామ‌ని క‌మ‌ల్ హాస‌న్ భావోద్వేగానికి గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చెన్నై పోలీసుల‌కు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్.. శంక‌ర్ స‌హా క్రేన్ ఆప‌రేట‌ర్... దాని ఓన‌ర్ కి స‌మ‌న్లు జారీ చేసారు. అలాగే కేసును సీబీసీఐడీకి బ‌దిలీ చేసారు.

విచార‌ణాధికారిగా కేంద్ర నేర విభాగం డిప్యూటీ క‌మీష‌న‌ర్ ని నియ‌మించారు. అయితే ఈ ఘ‌ట‌న‌ పై ఇప్ప‌టికే ద‌క్షిణ భార‌త సినీకార్మిక సంఘం( ఫెప్సీ) భ‌గ్గుమంది. కార్మికుల ప్రాణాలంటే లెక్క‌లేన‌ట్లు వ్య‌వ‌రిస్తున్నార‌ని ఆగ్రహం చెందారు. తాజా ప‌రిస్థితి చూస్తుంటే బాధిత కుటుంబాలు.. కార్మిక సంఘాలు క‌లిసి లైకాని మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టేసే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఫెప్సీ అధ్య‌క్షుడు ఆర్.కె. సెల్వ‌మ‌ణి (రోజా భ‌ర్త‌) న‌గ‌ర పోలీసు క‌మీష‌న‌ర్ ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ కేసును క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని.. పోలీసుల‌కు కార్మికుల స‌హ‌కారం పూర్తి స్థాయిలో ఉంటుంద‌ని తెలిపారు.

ఇక పోలీసుల‌కు స‌మ‌ర్పించిన లేఖ‌లో కార్మికుల భ‌ద్ర‌త‌కు సంబంధించి సినిమా నిర్మాత‌లు...స్టార్ హీరోలు ఎలాంటి జాగ్ర‌త‌ల్లు తీసుకుంటారు? పెద్ద కంపెనీలు సైతం కార్మికుల ప‌ట్ల ఎలా వ్య‌వ‌రిస్తారు? వ‌ంటి వివ‌రాలు అన్నింటిని విన‌తి ప‌త్రంలో పొందుప‌రిచిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హీరోల్ని...నిర్మాత‌ల్ని ఉద్దేశించి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియ‌న్ అధ్య‌క్షుడు రాధారవి ఇప్ప‌టికే సెటైర్లు విమ‌ర్శ‌ల‌తో విరుచుకు ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌ పై శంక‌ర్...క‌మ‌ల్ హాస‌న్..లైకా సంస్థ అంటే గిట్ట‌ని వాళ్లే ఇలా హ‌డావుడి చేస్తున్నార‌ని...బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని ఇప్ప‌టికే తాము చెప్పామ‌ని లైకా ప్ర‌తినిధులు చెబుతున్నారు.