Begin typing your search above and press return to search.

ఉత్త‌రాది ద‌క్షిణాది సింహాల క‌ల‌యిక‌లో?

By:  Tupaki Desk   |   2 Dec 2022 1:30 PM GMT
ఉత్త‌రాది ద‌క్షిణాది సింహాల క‌ల‌యిక‌లో?
X
పాన్ ఇండియా ట్రెండ్ లో ఇప్పుడు భాషాభేధం లేదు. ఏ భాషా చిత్రం అయినా ఇరుగు పొరుగు భాష‌ల్లో స్వేచ్ఛ‌గా రిలీజ్ చేసుకునేందుకు అన్నివిధాలా దారులు తెరుచుకున్నాయి. ప్ర‌పంచీక‌ర‌ణ అనంత‌ర ప‌రిణామంలో హాలీవుడ్ సినిమాలు వ‌చ్చి భార‌త‌దేశం నుంచి భారీగా సంప‌ద‌ల్ని దోచుకెళుతున్నాయి. కానీ భార‌త‌దేశం నుంచి వినోద‌రంగం ఇత‌ర దేశాల వైపు చూడ‌టానికే చాలా ఏళ్లు ప‌ట్టింది. కానీ ఇటీవ‌ల సౌత్ దూకుడుతో ఇరుగు పొరుగు దేశాల్లోను హ‌వా పెరుగుతోంది. భార‌తీయ సినిమా రంగంలో ఎవ‌రి ఉత్ప‌త్తిని ఎక్క‌డ అయినా అమ్ముకోవ‌చ్చు.. కొనుక్కోవ‌చ్చు.. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో (ద‌క్షిణాదిన) తెర‌కెక్కిన సినిమాకి గ్లోబ‌ల్ మార్కెట్ అమాంతం విస్త‌రిస్తోంది.

అమెరికా-బ్రిట‌న్- గ‌ల్ఫ్ తో పాటు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ - చైనా- కొరియా- ర‌ష్యా అంటూ ఆకాశ‌మే హ‌ద్దుగా తెలుగు త‌మిళ సినిమా విస్త‌రిస్తోంది. దీనిని ఆద‌ర్శంగా తీసుకోవాల్సిన స‌న్నివేశం బాలీవుడ్ కి ఎదురైందంటే అతిశ‌యోక్తి కాదు. నిజానికి హిందీ హీరోల‌కు ద‌క్షిణాదిన మార్కెట్ జీరో. దీంతో పాన్ ఇండియా హీరోలుగా వెల‌గ‌డం అంత సులువుగా లేదు. అరుదుగా క్రిష్ ఫ్రాంఛైజీ - ధూమ్ ఫ్రాంఛైజీలు త‌ప్ప ఇత‌ర హిందీ అనువాదాలేవీ ఇక్క‌డ స‌రిగా ఆడ‌లేదు. ఇటీవ‌లే వచ్చిన బ్ర‌హ్మాస్త్ర బాలీవుడ్ లో పెద్ద హిట్ట‌యినా తెలుగు -త‌మిళంలో అంతంత మాత్రంగానే ఆడింది. అందుకే మునుముందు హిందీ హీరోలు త‌మ ప్లాన్ ని యూట‌ర్న్ తిప్పే స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో తెలుగు త‌మిళ ద‌ర్శ‌కులతో ప‌ని చేసేందుకు మ‌న స్టార్ల‌ను క‌లుపుకుని న‌టించేందుకు బాలీవుడ్ హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. పైగా పాన్ ఇండియా కంటెంట్ పై క‌న్నేశారు. దీంతో ఈ వ్యూహం అన్ని స‌మీక‌ర‌ణాల‌ను మార్చేయ‌నుంద‌ని అంచ‌నా.

ఇప్పుడు బాలీవుడ్ లో 'సింగం' ఫ్రాంఛైజీకి ఇలాంటి ప్లాన్ ని అమ‌లు చేయ‌బోతున్నారా? అంటే అవున‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సూర్యవంశీ లాంటి కాప్ మూవీలో హింట్ ఇచ్చిన తర్వాత మేకర్స్ ప్రీప్రొడ‌క్ష‌న్ తో బిజీ అయ్యారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సూర్యవంశీ త‌ర్వాత మూడవ సింగం గురించి ఇప్ప‌టికి క్లారిటీ వ‌చ్చేసింది. సింగం ఫ్రాంచైజీలో మూడవ చిత్రం 'సింగం రిటర్న్స్‌'ని మేకర్స్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం టీమ్ ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ఈ ఫ్రాంచైజీ నుండి అజయ్ దేవ్‌గన్ పాత్ర బాజీరావ్ సింగం ఫోటోని కూడా త‌ర‌ణ్ ఆద‌ర్శ్ షేర్ చేసారు. "బిగ్ న్యూస్... అత్యంత విజయవంతమైన కాంబినేషన్ లలో సింగ‌మ్ స్ట్రైక్స్ ఎగైన్" ప్రారంభ‌మ‌వుతోంద‌ని త‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.

అక్ష‌య్ 'సూర్యవంశీ'లోని ఒక సన్నివేశంలో అతిథి పాత్రలో నటించిన సింగం (దేవ‌గ‌న్) సరిహద్దు ఉగ్రవాదులను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కాబ‌ట్టి సింగం ఎగైన్ సబ్జెక్ట్ ఈసారి ఉగ్రవాదంపై పోరాడే సింహం క‌థ‌తో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఫ్రాంచైజీలో మునుపటి రెండు చిత్రాలైన సింగం - సింగం రిటర్న్స్ కంటే ఈ చిత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంటుందని కూడా తెలుస్తోంది. దేవగన్ పాత్ర మొదటి చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నాయకుడు జయకాంత్ షిక్రే (ప్రకాష్ రాజ్)కి వ్యతిరేకంగా పోరాడే పోలీస్ గా క‌నిపిస్తుంది. మోసం చేసే ఆధ్యాత్మిక గురువు బాబాజీ (అమోల్ గుప్తే) .. మంత్రి ప్రకాష్ రావు (జాకీర్ హుస్సేన్)ల‌కు వ్యతిరేకంగా సింఘం రిటర్న్స్ పార్ట్ 3 లో భారీ యాక్ష‌న్ ని మేళ‌విస్తున్నార‌ని స‌మాచారం.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కించే ప్లాన్ తో ఉన్న రోహిత్ శెట్టి ఇందులో ఒరిజిన‌ల్ (త‌మిళ మాతృక‌) హీరోతో ఒక కీల‌క పాత్ర‌ను చేయించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు గుస‌గులు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. ఈ సినిమా అటు ఉత్త‌రాది ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా ఓ ఊపు ఊపుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఆర్.ఆర్.ఆర్ లాంటి క్రేజీ చిత్రంతో అజ‌య్ దేవ‌గ‌న్ తెలుగు-త‌మిళ ఆడియెన్ కి క‌నెక్ట‌య్యాడు. ఇప్పుడు సూర్య‌తో క‌లిసి దేవ‌గ‌న్ 'సింగం 3' లో న‌టిస్తే అది ఇరువురు హీరోల‌కు క‌లిసొచ్చే అంశంగా మారుతుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అయితే దీనిపై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కానీ త‌ర‌ణ్ కానీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ప్ర‌స్తుతానికి ఇది గుస‌గుస మాత్ర‌మే. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.