విలన్ గా స్టార్ హీరోలతో తలపడటానికి రెడీ!

Wed Jun 29 2022 06:00:02 GMT+0530 (IST)

I'm also ready to be a villain in Star Heroes movies

టాలీవుడ్ లో విలన్ వేషాల వైపు నుంచి హీరో వేషాల వైపు వచ్చిన వాళ్లు కొంతమంది ఉన్నారు. కానీ గోపీచంద్ విషయానికొస్తే ముందుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి .. ఆ తరువాత విలన్ వేషాల వైపు వెళ్లి సక్సెస్ అనిపించుకుని మళ్లీ హీరో పాత్రల దిశగా వచ్చాడు. యాక్షన్ హీరోగా మాత్రమే రాణిస్తాడని అనుకుంటే ఫ్యామిలీ హీరోగా కూడా ఎందరో అభిమానాన్ని  గెలుచుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'పక్కా కమర్షియల్' జులై 1వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా ఆయన అనేక విషయాలను ప్రస్తావించాడు.ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో హీరోగా 'తొలివలపు' చేశాను. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత ఎవరూ పిలవడం లేదు .. వేషాలు ఇవ్వడం లేదు. ఇండస్ట్రీకి వచ్చి తప్పు చేశానా ఏంటి? అనుకున్నాను.అలా ఆరు .. ఏడు నెలలు గడిచిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు తేజ గారు పిలిచి 'జయం' సినిమాలో విలన్ రోల్ చేస్తావా? అని అడిగారు.  నేను ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను. ఆ సినిమాలో ఆ రోల్ ఎంత సక్సెస్ అయిందనేది మీకు తెలిసిందే.

ఈ మధ్య కూడా తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసింది .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఇక ప్రభాస్ తో నా ఫ్రెండ్షిప్  'వర్షం' సినిమా నుంచే అని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుముందు నుంచి మేము మంచి స్నేహితులం.

గోపీకృష్ణ ఆఫీస్ దగ్గర తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. 'వర్షం' సినిమా నుంచి మా స్నేహం మరింత బలపడింది. తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అయినా కలిసినప్పుడల్లా మళ్లీ ఒక సినిమా చేద్దామని అంటూ ఉంటాడు. తప్పకుండా మళ్లీ కలిసి నటిస్తామనే నమ్మకం నాకు ఉంది.

ఇక స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. కాకపోతే ఆ పాత్ర డిఫరెంట్ గా .. నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఏదో చేశామంటే చేశాము అన్నట్టుగా ఉండకూడదు. పాత్ర నచ్చితే చేయడానికి మాత్రం నేను సిద్ధంగానే ఉన్నాను.

'ఒక్కడు' సినిమాకి ముందుగా ప్రకాశ్ రాజ్ ను అనుకున్నారు .. ఆ తరువాత ఆయన డేట్స్ కుదరడం లేదని నన్ను చేయమన్నారు .. నేను చేస్తానని అన్నాను. ఆ తరువాత ప్రకాశ్ రాజ్  డేట్స్ సర్దుబాటు చేస్తానని చెప్పడంతో ఆయననే  తీసుకున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.