ట్రైలర్ టాక్: ఆకట్టుకునేలా 'IIT కృష్ణమూర్తి'

Sat Dec 05 2020 16:12:53 GMT+0530 (IST)

Iit Krishnamurthy Movie Trailer

పృథ్వీ దండమూడి - మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ''IIT కృష్ణమూర్తి''. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శ్రీవర్ధన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్నమైన కథా కథనాలతో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిసెంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ చిత్రం నుంచి 'మేఘంతో మేఘం మురిసే..' అనే సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో తాజాగా 'ఐఐటీ కృష్ణమూర్తి' మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ట్రైలర్ ని ఆవిష్కరించాడు.ఐఐటీ బాంబేలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న కృష్ణమూర్తి కనిపించకుండా పోయిన తన బాబాయిని వెతికే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. తన బాబాయ్ డెత్ మిస్టరీని ఛేదించే క్రమంలో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేది ఇందులో చూపించారు. దీనికి నరేష్ కుమారన్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ యేసు.పి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తం మీద 'ఐఐటీ కృష్ణమూర్తి' ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు. అనిల్ కుమార్.పి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో వినయ్ వర్మ - భారతి ఆనంద్ - బెనర్జీ - కమెడియన్ సత్య తదితరులు నటించారు.