స్పేస్ లో మొదటి మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే..!

Sun Aug 02 2020 15:40:28 GMT+0530 (IST)

Do you know the first movie budget in space ..!

అంతరిక్షం (స్పేస్) నేపథ్యం అంటేనే ఆసక్తికరం. స్పేస్ లో ప్రయోగాలు.. స్పేస్ పై సినిమాలు ఉత్కంఠ పెంచుతాయి. గ్రావిటీ.. స్పేస్ ఒడిస్సీ.. ఇంటర్ స్టెల్లార్ .. ఇలా అంతరిక్షం (స్పేస్) నేపథ్యంలో ఎన్నో గొప్ప చిత్రాలొచ్చాయి. ఆస్కార్ లు కొల్లగొట్టి సినీమేధావుల మనసు దోచిన చిత్రాలివి.ప్రాంతీయ భాషల్లోనూ ఇలాంటి గొప్ప సినిమాలు తీయాలని కలలుగనే ఔత్సాహిక ప్రతిభావంతులకు కొదవేమీ లేదు. తెలుగులో వరుణ్ తేజ్ అంతరిక్షం ఈ తరహా ప్రయత్నమే. యువదర్శకుడు సంకల్ప్ రెడ్డి సంకల్ప బలాన్ని జయాపజయాలతో పోల్చి చూడకుండా అందుకే మెచ్చుకున్నారు. తమిళంలో జయం రవి ఈ తరహా ప్రయత్నం చేశాడు. అయితే ఇవన్నీ బ్లూ మ్యాట్- గ్రీన్ మ్యాట్ తో తీసిన సినిమాలు. ఇప్పటివరకూ హాలీవుడ్ లోనూ బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ ఫార్మాట్ లో తీసినవే. విజువల్ గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేసినవి. కానీ అందుకు వైవిధ్యమైన ప్రయత్నం జరిగితేనే అది వింత.

తాజాగా మరో స్పేస్ మూవీ వైవిధ్యమైన ప్రయత్నం ఉత్కంఠ పెంచుతోంది. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ స్పేస్ పై ఒక చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారని సమాచారం. దాని కోసం అతను నాసాతో చేతులు కలిపారట. తాజా సమాచారం ప్రకారం.. మిషన్ ఇంపాజిబుల్ ఫేమ్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ కథా చర్చల్లో చేరుతున్నారట. అంతరిక్షంలో చిత్రీకరించనున్న మొట్టమొదటి ప్రాజెక్టుగా ప్రచారమవుతోంది.

ఈ చిత్రం కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? అంటే.. దాదాపు 200 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. 200 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో దాని విలువ 1499 కోట్లు. ప్రఖ్యాత యూనివర్సల్ పిక్చర్స్ 2022 లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేయనుందని సమాచారం.