Begin typing your search above and press return to search.

క్రియేటివిటీ ఎక్కువైపోతేనే ఇలాంటి సినిమాలు వస్తాయి..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 PM GMT
క్రియేటివిటీ ఎక్కువైపోతేనే ఇలాంటి సినిమాలు వస్తాయి..!
X
క‌రోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలా చిత్రాలు థియేట్రికల్ రిలీజులు స్కిప్ చేసి ఓటీటీ ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు డిజిటల్ వేదికలపై విడుదల కాగా.. నిన్న శుక్రవారం మరో భారీ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ''జగమే తంత్రం''. 'పిజ్జా' 'పేట' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

'ఆకాశం నీ హద్దురా' సినిమా తర్వాత చాలా రోజులకు ఓటీటీలో వస్తున్న పెద్ద సినిమా కావడంతో 'జగమే తంత్రం' పై భారీ హైప్ క్రియేట్ అయింది. టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అందరి దృష్టి దీనిపై పడింది. 17 భాషల్లో 190 దేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమా అంటూ హడావుడి చేయడంతో అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తీరా నిన్న సినిమా చూసిన తర్వాత మెజారిటీ ఆడియన్స్ సినిమాపై పెదవి విరిచారు.

'అసుర‌న్' 'క‌ర్ణ‌న్' లాంటి రెండు బ్లాక్‌ బ‌స్ట‌ర్ల త‌ర్వాత ధనుష్ నుంచి ఇలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయలేదనే కామెంట్స్ వస్తున్నాయి. 'కబాలి' ఛాయలున్న కథను ఎంపిక చేసుకున్న కార్తీక్ సుబ్బారాజు.. చెప్పాలనుకున్న విషయాన్ని సినిమాగా తెరకెక్కించడంలో తడబడ్డారని అంటున్నారు. క్రియేటివిటీ ఎక్కువైపోతేనే ఇలాంటి టిపిక‌ల్ కథలు సినిమాలు వస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని థియేట‌ర్ లో విడుద‌ల చేయ‌కుండా త‌మిళ‌, తెలుగు డిస్ట్రీబ్యూట‌ర్ల‌ని ధ‌నుష్ కాపాడేశాడ‌ని సెటైర్లు వేస్తున్నారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ తో.. ఆ స్థాయి కంటెంట్ తో పోటీ ప‌డ‌టంలో త‌ప్పు లేదు. కానీ లోక‌ల్ గా జ‌నాలు ఎలాంటి సినిమాల్ని ప్ర‌స్తుతం ఆద‌రిస్తున్నారో అలాంటి సినిమాలు తీస్తేనే ఎంట‌ర్టైన్మెంట్ ఇండ‌స్ట్రీ అనే ప‌దానికి ఓ అర్థం ఉంటుంది. అలా లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు 'జ‌గ‌మే తంత్రం' ఒక ఉదాహరణ. మరి ఈ సినిమా థియేట్రికల్ ఎక్సపీరీయన్స్ చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో..!