'సరిలేరు నీకెవ్వరు' ఇండస్ట్రీ హిట్ అయితే.. మరి 'అల వైకుంఠపురములో'..?

Fri Jul 23 2021 20:00:01 GMT+0530 (IST)

Sarileru Nikevvaru is an industry hit

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''సరిలేరు నీకెవ్వరు''. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - ఏకే ఎంటర్టైన్మెంట్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2020 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు(గ్రాస్) సాధించిన టాప్-50 చిత్రాలలో 41వ స్థానంలో నిలిచింది. ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమా('తన్హాజీ' ఫస్ట్ ప్లేస్).. టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో ఉన్న ఏకైక చిత్రంగా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన వెబ్ సైట్ గా చెప్పుకునే బాక్సాఫీస్ మోజో ఈ వివరాలను ప్రకటించింది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా లాంగ్ రన్ లో డొమెస్టిక్ మరియు ఫారిన్ కలెక్షన్స్ కలిపి రూ. 278 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్క ప్రకారం టాలీవుడ్ లో ఆల్ టైమ్ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ మహేష్ ఖాతాలో చేరిందన్నమాట. అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా చెబుతూ వస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమా ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో 'ఇండస్ట్రీ హిట్' మాదే అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ ఫ్యాన్స్ - బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది.

గతేడాది సంక్రాంతికే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమా విడుదల అయింది. ఆ సమయంలో సంక్రాంతి మొగుడు - సంక్రాంతి విన్నర్ అంటూ పోటాపోటీగా పోస్టర్స్ రిలీజ్ చేసుకోవడం.. ఫ్యాన్ వార్ జరగడం తెలిసిందే. అయితే ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం 2020లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమా అనే లెక్కలు బయటకు రావడంతో మరోసారి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎవరివి ఫేక్ కలెక్షన్స్ అనేవి ఇప్పుడు బయట పడిందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'అల వైకుంఠపురములో' సినిమా డొమెస్టిక్ కలెక్షన్లు యాడ్ చేయలేదు కాబట్టే ఆ జాబితాలో లేదని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఫేక్ కాబట్టే మోజోలో డొమెస్టిక్ వసూళ్ళు అప్లోడ్ చేయలేదని మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా మరోసారి సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది.