ఈ సమయంలో మీకు బర్త్ డే విషెష్ చెప్పాలని లేదు సాయి పల్లవి

Sun May 09 2021 19:00:01 GMT+0530 (IST)

I do not want to say birthday special to you at this time Sai Pallavi

టాలీవుడ్ కు ఫిదా సినిమాతో పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే అందరి హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను చేస్తూ నటిగా తనను తాను ప్రతి సినిమాకు తీర్చిదిద్దుకుంటూ ఉన్న సాయి పల్లవి పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్ లు వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా లోని సాయి పల్లవి లుక్ ను రివీల్ చేశారు. సినిమాలోని సాయి పల్లవి లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇక సాయి పల్లవి నటించిన మరో సినిమా విరాటపర్వం. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా నుండి కూడా పోస్టర్ వస్తుందని అంతా ఆశించారు. కాని దర్శకుడు వేణు ఉడుగుల పోస్టర్ విడుదల చేయలేదు.



సోషల్ మీడియాలో దర్శకుడు వేణు ఉడుగుల.. ''ఈ సంక్షోభ సందర్బాన మీకు పుట్టినరోజు విషెస్ చెప్పటం సహేతుకం అనిపించలేదు. అందుకే #Virataparvam పోస్టర్ ని కూడా విడుదల చేయలేదు. మీ అభినయ విశేషముతో ఈ రత్నఖచిత భువనాన తీరొక్క పూల కవనమై వెలుగొందే మీలాంటి హృదయగత జీవులంతా బాగుండాలి.కాలానికి ఎదురీది నిలబడాలి. జీతే రహో Saipallavi గారు!'' అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ తో దర్శకుడు వేణు మరోసారి విభిన్నమైన దర్శకుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

విరాట పర్వం సినిమా ను గత నెలలోనే విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా వాయిదా వేయడం జరిగింది. సెకండ్ వేవ్ వల్ల పలు సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి. అందులో విరాట పర్వం సినిమా కూడా ఉంది. రానా హీరోగా నటించిన విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి పాత్ర చాలా విభిన్నంగా ఉంది. టీజర్ మరియు ట్రైలర్ లో సాయి పల్లవి లుక్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ చాలా సింపుల్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా విరాట పర్వం సినిమా తో సాయి పల్లవి నటిగా పది మెట్లు పైకి ఎక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.