చైతూతో చేశాను .. అఖిల్ తో చేయబోతున్నాను: నాగ్

Mon Sep 26 2022 09:51:57 GMT+0530 (India Standard Time)

I did it with Chaitu.. I'm going to do it with Akhil: Nag

'గరుడ వేగా' దర్శకుడిగా ప్రవీణ్ సత్తారుకు మంచి పేరు తీసుకొచ్చింది. స్టైలీష్ యాక్షన్ తో కూడిన కథలను ఆయన బాగా  తెరకెక్కించగలడని చెప్పుకున్నారు. అలాంటి ఆయన తన నెక్స్ట్ సినిమాను నాగార్జునతో చేశారు .. ఆ సినిమా పేరే 'ది ఘోస్ట్'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - నార్త్ స్టార్ వారు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్క్ కె రాబిన్  సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్  5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో .. అభిమానుల సమక్షంలో జరిగింది.ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ .."ఈ రోజున ఒకే స్టేజ్ పై నేను .. నాగచైతన్య .. అఖిల్ కలిసి ఇంతటి ప్రేమను పొందడానికి మొదటి కారణం తెలుగు సినిమా పరిశ్రమ అయితే రెండవ కారణం మా నాన్నగారు అనే చెప్పాలి. మీ అందరి కేరింతలు .. సంతోషాలు చూడటం కోసమే చైతూను ..

అఖిల్ ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. చైతూతో 'బంగార్రాజు' చేశాను .. అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఆ ప్రాజెక్టు మొదలవబోతోంది. ఇక ' ది ఘోస్ట్' విషయానికి వస్తే మీరంతా నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తాను.

33  ఏళ్ల క్రితం 'శివ' రిలీజైన రోజునే 'ఘోస్ట్' రిలీజ్ అవుతుండటం విశేషం. ఆ సినిమాలో చైన్ పట్టుకొస్తే ఈ సినిమాలో కత్తి పట్టుకుని వస్తున్నాను. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమాను కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను" అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక అఖిల్ మాట్లాడుతూ .. "ఇందాకటి నుంచి నేను ..

చైతూ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు చూస్తూ వచ్చాము. నాన్నగారి ఆకలి ఇంకా తీరలేదా? అనుకున్నాము. 30 ఏళ్ల తరువాత కూడా ఆయన ఇంతటి ఎనర్జీతో పనిచేయడం చూస్తే మా ఎనర్జీ ఆయనే అనిపించింది. ఈ సినిమాలో మా నాన్నని ఎలా చూడాలని నేను అనుకున్నానో ప్రవీణ్ సత్తారు అలాగే చూపించాడు" అన్నాడు.

ఇక చైతూ మాట్లాడుతూ .. "నాన్నగారు ఈ సినిమా షూటింగు మొదలైన దగ్గర నుంచి నేను ఎప్పుడు కలిసినా ఈ  సినిమాను గురించే మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ స్థాయిలో ఆయన ఒక సినిమాను గురించి ఆత్రుతగా ఎదురుచూడటం నేను చూడలేదు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది .. ఆ రోజున కర్నూల్లో స్క్రీన్లు చిరిగిపోవడం పక్కా అనే నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.