Begin typing your search above and press return to search.

నన్ను అంకుల్ అనడం నాకు నచ్చలేదు: బాలకృష్ణ

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:30 PM GMT
నన్ను అంకుల్ అనడం నాకు నచ్చలేదు: బాలకృష్ణ
X
కొంతకాలంగా ఇటు బాలకృష్ణకి గాని .. అటు బోయపాటికి గాని చెప్పుకోదగిన హిట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు కొత్త రికార్డులను సెట్ చేసి పెట్టాయి. అందువలన సహజంగానే 'అఖండ'పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. అంతకుముందు బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, 'సింహా' .. 'లెజెండ్' సినిమాల్లో ఆయన లుక్ వేరే లెవెల్లో ఉంది. డైలాగ్స్ .. యాక్షన్ సీన్స్ పరంగా కూడా బాలకృష్ణ సినిమాలను బోయపాటి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడు.

ఇక తాజాగా వచ్చిన 'అఖండ' ఈ ఇద్దరికీ కలిపి హ్యాట్రిక్ హిట్ ను ముట్టజెప్పేసింది. తెరపై ఇలా బొమ్మ పడిందో లేదో అలా ఈ సినిమా హిట్ టాక్ బయటికి వచ్చేసింది. బాలయ్య అభిమానులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. థియేటర్ల దగ్గర జాతర వాతావారణం కనిపిస్తోంది. దర్శక నిర్మాతలతోను .. సంగీత దర్శకుడు తమన్ తోను కలిసి ఈ సినిమాను చూసిన బాలకృష్ణ, సక్సెస్ మీట్ లో మాట్లాడారు. 'అఖండ' సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది. కొత్తదనాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తామనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు.

ఈ సినిమా పెద్దవాళ్లనే కాదు చిన్నపిల్లలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఇంతటి భయంకరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ లో బయటికి వచ్చినప్పుడు, 'చాలా అద్భుతంగా ఉంది అంకుల్' అని చిన్నచిన్న పిల్లలు వచ్చి చెబుతున్నారు. నాకు ఒకటే నచ్చలేదు .. నన్ను అంకుల్ అని పిలవడం. అంకులు ఏంట్రా అంకులు .. అంటూ నవ్వేశారు. ఇది కేవలం మా విజయమని అనుకోవడం లేదు .. చలనచిత్ర పరిశ్రమ విజయం. ఎన్నో లొకేషన్స్ లో ఈ సినిమాను షూట్ చేశాము .. గుప్తంగా ఉండే ఎన్నో నిజాలను చూపించాము.

ఈ సినిమాలో ఎక్కడా కూడా మీకు అవనసరమైన సన్నివేశం కనిపించదు .. అనవసరమైన డైలాగ్ వినిపించదు. ఎక్కడ ఏది అవసరమో అది అంతవరకే బోయపాటి సర్దుతూ వచ్చారు. మరి బోయపాటితో నెక్స్ట్ ఏమిటి? అనే ఆలోచన రావడం సహజం. ఆ విషయాన్ని గురించి మేము ఇప్పుడే ఆలోచన చేయము. ఎందుకంటే నేను గానీ .. బోయపాటి గాని 'లెజెండ్' సినిమాకి పని చేస్తున్నప్పుడు 'సింహా' గురించి ఆలోచించలేదు. అలాగే 'అఖండ' సినిమాకి పనిచేస్తున్నప్పుడు 'లెజెండ్' సినిమాను గురించి ఆలోచించలేదు. అంతా దైవ సంకల్పం .. దేవుడిని ఎక్కువగా నమ్ముతాం .. పనే దేవుడు కనుక ఆ పనినే మేము నమ్ముతాం. మా ఇండస్ట్రీని మేము నమ్ముకుంటాము" అని చెప్పుకొచ్చారు.