దుబాయ్ లో రకుల్ సాహసం.. వింటే గగుర్పాటే!

Tue Feb 12 2019 11:06:31 GMT+0530 (IST)

I Am Adventurous In Real Life Said Rakul Preet Singh

అందానికిప్రాక్టికాలిటి రూపమిస్తే..రకుల్ అవుతుందన్న మాట సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. పక్కా ప్రొఫెషనల్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గడిచిన ఏడాదంతా ఒక్క సినిమాలోనూ దర్శనమివ్వలేదు. తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు వినిపించే రకుల్ సినిమా గడిచిన ఏడాదిలో ఒక్కటి విడుదల కాకపోవటానికి కారణం అమ్మడు ఖాళీగా ఉండటం కాదు.. తెలుగు సినిమాలకు సైన్ చేయకపోవటం.తమిళ.. హిందీ సినిమాల్లో రకుల్ ఓకే చేసిన సినిమాల షూటింగ్ లతో బిజీ కావటంతో ఆమె సినిమాలు రిలీజ్ కాలేదు. ఆ లోటు తీరుస్తూ.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల వరకూ విడుదల కానున్నాయట. అందులో భాగంగా ఈ ఏడాది రకుల్ తొలి సినిమా దేవ్ ఈ వారం విడుదల కానుంది. మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం.. తోపుల్లాంటి అగ్రహీరోహీయిన్లు సైతం మీడియా ముందుకు రావాల్సిందే.

తాజాగా రకుల్ మీడియా ముందుకు వచ్చేసింది. అన్ని కబుర్లు చెబుతూనే.. తన వ్యక్తిగత విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ మధ్యన షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లిన ఆమె ఒక సాహసం చేసిందట. ఆ వివరాలు విన్నంతనే ఒళ్లు వణకటం ఖాయం. ఇంతకీ రకుల్ చేసిన సాహసం ఏమంటే.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి దూకటం. ప్యారాచూట్ గట్రా.. గట్రా లాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికి.. టైం బాగోక అవి కానీ అనుకున్నట్లుగా ఓపెన్ కాకుంటే.. ప్రాణాలు పోవటం ఖాయం. అలాంటి ఉదంతాలెన్నో ఉన్నాయి.

ఇలాంటి సాహసాలు రకుల్ కు కొత్తేం కాదు. గతంలో స్కూబా డ్రైవ్.. బంగీ జంప్ చేసిన రకుల్ ఈసారి ఏకంగా స్కై డ్రైవింగ్ చేసింది. డ్రైవ్ చేసేవరకూ ధైర్యంగా ఉన్నా.. దూకే టైంలో మాత్రం చేతిలో ఇన్ని సినిమాలున్న వేళ.. ఇలాంటి సాహసాలు చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ పారాచూట్ పని చేయకపోతే లాంటి ఆలోచనలు చాలానే వచ్చాయట. అయితే.. ఎలాంటి ట్విస్టులు లేకుండా స్కైడ్రైవింగ్ అంతా అనుకున్నట్లే జరిగింది. దూకే ముందున్న ఆలోచనలు ఏవీ.. దూకిన తర్వాత దగ్గరకు రాలేదట.

తాను చేసిన సాహసానికి సంబంధించి వాట్సాప్ వీడియోను ఇంటికి పంపిందట. దానని చూసిన రకుల్ అమ్మ కంగారు పడి.. తిట్టి పోస్తే.. వాళ్ల నాన్న మాత్రం నాకూ చెబితే నేనూ వచ్చేవాణ్నిగా అని చెప్పారట. రకుల్ సంగతేమోకానీ.. ఆమె సాహసం అభిమానులకు కంగారు పుట్టించటం ఖాయం. తాజా స్కై డ్రైవ్ ఎపిసోడ్ తో తనలో అందమే కాదు..ధైర్యం పాళ్లు ఎక్కువని రకుల్ తేల్చిందని చెప్పక తప్పదు.