ప్చ్ ఆర్జీవీ! పబ్లిసిటీ స్టంట్ మరీ ఇలానా!!

Sat Jul 20 2019 20:35:57 GMT+0530 (IST)

రాంగోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఏం చేసినా అందులో పరమార్థం ఉంటుంది. తెలిసీ కెలుక్కోవడం ఆయనకో హ్యాబిట్. అలా ఎందుకు చేస్తాడో కూడా మనకు ఈజీగానే తెలుసు. ఆయన తప్పు చేస్తే పోలీసులు అలా సరదా తీర్చారులే అనుకోవడానికేం లేదు. ఇది పక్కా పబ్లిసిటీ స్టంట్ అని ఆర్జీవీ ట్రిపుల్ రైడ్ చెప్పకనే చెబుతోంది. ఫైన్ వేశారు.. పోలీసులు గ్రేట్! అని అనుకోవాలా ఈ ఎపిసోడ్ లో. లేక ఆర్జీవీకి ఇస్మార్ట్ శంకర్ కి పబ్లిసిటీ కలిసొచ్చిందని భావించాలా?మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కిక్కు పూరి కంటే గురువు ఆర్జీవీకే ఎక్కువ ఎక్కింది. ఆ ఉత్సాహంలోనే బీర్ పొంగించి ఇస్మార్ట్ టీమ్ తో ఆర్జీవీ చేసిన రచ్చ తెలిసిందే. ఆ వీడియోని తనే నేరుగా ఇన్ స్టాలో షేర్ చేసి వేడెక్కించారు. ఆ బీర్ పార్టీ గురించి ముచ్చట సాగుతుండగానే ఆర్జీవీ హైదరాబాద్ రోడ్లపై ట్రిపుల్ రైడ్ కి వెళ్లడం.. మూసాపేట్ శ్రీరాములు థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడడం జరిగింది. తనతో పాటు మరో ఇద్దరు బైక్ ఎక్కడంతో ట్రిపుల్ రైడ్ అందరి కళ్లబడింది.

ట్రిపుల్ రైడ్ కి వెళ్లారు సరే.. కామ్ గా ఉండొచ్చు కదా? అలా ఉంటే ఆర్జీవీ ఎందుకు అవుతారు? ఆయనకు ఏదో రకంగా ఉచిత పబ్లిసిటీ కావాలి. అందుకే ఆ ట్రిపుల్ రైడ్ వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి పోలీసులతో వెటకారం ఆడారు ఆర్జీవీ. ``పోలీసులు ఎక్కడున్నారు? థియేటర్లలో `ఇస్మార్ట్ శంకర్` చూస్తున్నారనుకుంటా`` అంటూ కవ్వింతగా వెటకారంగా ట్వీట్ చేశారు. దీంతో కాలిన పోలీసుల బృందం ఆర్జీవీ అండ్ గ్యాంగ్ కి జరిమానా విధించారు. ఆ ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ను టీఎస్ 07 జీపీ 2552గా గుర్తించి యజమాని బద్దె దిలీప్ కుమార్ కు రూ.1300 బిల్లు చలాన్ రాశారు. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడ్ చేసినందుకు బిల్లు పడింది. సెలబ్రిటీలు అయినా ఇలా ముక్కు పిండినందుకు పోలీసుల్ని పొగిడేస్తున్నారు. అయితే అంతగా పోలీసులు ఏం సాధించారని.. వర్మకు ఇస్మార్ట్ శంకర్ కి ప్రచారం తేవడం తప్ప! 1300 చలాన్ వీళ్లకేమైనా లెక్కనా? ఇంత డెడ్ ఛీప్ గా ఇస్మార్ట్ పబ్లిసిటీ దొరికేయడం గొప్పే కదా?  ప్చ్!! పాపం పోలీసులే అనవసరంగా పని పోగొట్టుకున్నారు! అనుకునే పరిస్థితి ఇది.