రాజుగారికి భారీ షాక్.. పీఆర్ టీమ్ కు పాఠం!

Mon Feb 10 2020 11:17:44 GMT+0530 (IST)

Huge Shock To Dil Raju

ఒక క్లాసిక్ సినిమాను రీమేక్ చెయ్యడం అనేది ఎప్పుడూ కత్తిమీద సామే అని చెప్పాలి. ఎందుకంటే సినిమాను నేటివిటీకి తగ్గట్టు మారిస్తే ఒక గోల.. మార్చకపోతే ఒక గోల. ఒక భాషకు సంబంధించిన ప్రేక్షకుల అభిరుచులు ఒకరకంగా ఉంటే మరో భాషకు సంబంధించిన ప్రేక్షకుల అభిరుచులు మరోరకంగా ఉంటాయి. సినిమా బాగుందని అందరూ చెప్పినప్పటికీ కలెక్షన్లు మాత్రం రావు. ప్రస్తుతం '96' సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన 'జాను' ఇదే పరిస్థితి ఎదుర్కొంటోందని ట్రేడ్ రిపోర్ట్స్ ను చూస్తేనే అర్థం అవుతుంది.నిజానికి ఈ సినిమాకు మంచి టీమ్ ఉంది. సమంతా లాంటి స్టార్ హీరోయిన్.. శర్వానంద్ లాంటి మంచి నటుడు.. దిల్ రాజు బ్యానర్.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ప్లస్సులే. అయితే సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అయినప్పటికీ కథనం నత్తనడకన సాగుతుంది. ఇలా నెమ్మదిగా సాగే కథలకు తమిళంలో..మలయాళంలో అపూర్వ ఆదరణ దక్కుతుంది కానీ తెలుగు ఆడియన్స్ కు కాస్త వేగం అవసరం. తెలుగు రీమేక్ విషయంలో ఇదొక మైనస్ కాగా.. తమిళ ఒరిజినల్ ను ఎక్కువమంది ప్రేక్షకులు ఇప్పటికే చూసి ఉండడం కూడా మరో ఇబ్బందిగా మారింది. దీంతో సమంతా క్రేజ్.. శర్వానంద్ నటన.. దిల్ రాజు బ్యానర్ లాంటివి ఏవీ ఈ సినిమాను కాపాడలేకపోతున్నాయి.

అమెరికాలో మొదటి రోజునుంచి ఈ సినిమా నామమాత్రపు వసూళ్లు మాత్రమే ఈ సినిమా నమోదు చేసింది. డిస్ట్రిబ్యూటర్ కు లాస్ తప్పదని ట్రేడ్ వర్గాల వారి అభిప్రాయం. ఇక లోకల్ గా కూడా సినిమా పరిస్థితి అశాజనకంగా లేదు. బీ.. సి సెంటర్లలో 'జాను' ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోందని అంటున్నారు. ఓవరాల్ కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉండడం ట్రేడ్ వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తోంది.

ఈ రిజల్ట్ నిర్మాత దిల్ రాజుకి ఒక షాక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పీఆర్ టీమ్ కు ఇదో పాఠం అని కూడా కొందరు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. సరిగా ప్రమోషన్స్ చెయ్యకపోవడంతో సినిమా రిలీజ్ కు ముందు బజ్ తీసుకురాలేకపోయారు.. ఇక సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో కూడా విఫలమయ్యారు. ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయం దిల్ రాజు టీమ్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని కూడా సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.