సినిమా ప్రేమికులకు 'నవ' రత్నాలు

Wed Jul 17 2019 14:00:29 GMT+0530 (IST)

మహర్షిని మినహాయించి గత మూడు నాలుగు నెలలుగా అందరిని మెప్పించిన సరైన సినిమా లేదే అని కలవరపడుతున్న సినిమా ప్రేమికులకు ఇకపై వరస పండగలు పలకరించబోతున్నాయి. ఏదో నెంబర్ ఘనంగా వస్తున్నాయని కాదు కానీ లైన్ లో ఉన్నవన్నీ మంచి క్రేజ్ తో పాటు స్టార్లు నటించినవి అంచనాలు భారీగా ఉన్నవి కావడం అసలు విశేషం. రేపు రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బోణీ జరగనుంది. ఇప్పటికే మాస్ ఆడియన్స్ లో దీని మీద అంచనాలు పెరిగిపోయి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి.ఆపై వారం గ్యాప్ తో విజయ్ దేవరకొండా డియర్ కామ్రేడ్ తో రచ్చ చేయబోతున్నాడు. సుమారు ఏడు నెలలకు పైగా గ్యాప్ తో వస్తున్న ఈ హీరో మూవీ కాబట్టి ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు ఖాయమనే ధీమాతో ఉన్నారు నిర్మాతలు. నెక్స్ట్ ఆగస్ట్ 2 కార్తికేయ గుణ 369తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు బరిలో దిగుతున్నాయి. మార్కెట్ పరంగా ఈ ఇద్దరు పెద్ద రేంజ్ కాకపోయినా సబ్జెక్ట్ పరంగా చేస్తున్న ప్రమోషన్ హైప్ తెస్తోంది. ఇక ఆగస్ట్ 9 నాగార్జున మన్మథుడు 2తో అల్లరి చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆగస్ట్ 15 స్లాట్ ప్రభాస్ సాహో వదిలేయడంతో ఇప్పుడు దాన్ని శర్వానంద్ రణరంగం అడవి శేష్ ఎవరుతో భర్తీ చేయబోతున్నారు. ఇది డబుల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి 23 స్లాట్ ఖాళీగా ఉంది. 30న గ్యాంగ్ లీడర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సాహో కూడా అదే తేదీ కావాలంటే నిర్ణయం మారుతుందా లేక క్లాష్ కి సై అంటారా వేచి చూడాలి. ఇలా వరసబెట్టి సినిమాల పండగలతో మూవీ లవర్స్ మనసులు సంతోషంతో బరువెక్కడం పర్సులు ఖాళీ కావడం ఒకేసారి జరిగేలా ఉన్నాయి. బయ్యర్లలు మాత్రం ఈ సందడితో టికెట్ కౌంటర్లు ఎక్కువ రోజులు కళకళలాడతాయని ఆశిస్తున్నారు