ఓపెనింగ్ లకు రష్మీకి మస్తు డిమాండ్..కారణం అదేనట!

Sun Dec 15 2019 13:01:19 GMT+0530 (IST)

Huge Demand For Rashmika Mandanna For Shop Openings

సినిమాల సంగతి తర్వాత టీవీ చూసే అలవాటున్న ప్రతి తెలుగువాడికి రష్మీ గౌతమ్ సుపరిచితం. బుల్లితెర మీద యాంకర్ ఇమేజ్ ను మార్చేసిన ముద్దుగుమ్ముల్లో ఆమె ముందుంటారు. అంతకు ముందున్న యాంకర్ల తీరుకు భిన్నంగా వ్యవహరించిన ఆమె.. కుర్రాకారులో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.ఇటీవల కాలంలో రష్మీకి షాపింగ్ మాల్స్.. షోరూమ్ ల ఓపెనింగ్ లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ కంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని టైర్ టూ సిటీస్ లో తరచూ పర్యటిస్తూ.. పలు షాపుల్ని ఓపెన్ చేస్తున్నారు. ఎందుకింత క్రేజ్.. వ్యాపారులకు రష్మీనే ఎందుకంత ఆకట్టుకుంటోంది? చాలామంది హీరోయిన్స్ కు లేని డిమాండ్ రష్మీకే ఎందుకు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం రష్మీకున్న ఇమేజ్.. క్రేజ్ కారణంగా ఆమెకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు టాప్ హీరోయిన్లను తీసుకురావాలంటే చెల్లించాల్సిన రెమ్యునరేషన్ తో పోలిస్తే రష్మీ ఛార్జ్ చేసే అమౌంట్ తక్కువగా ఉండటం ప్రధాన కారణంగా చెబుతారు.

దీనికి తోడు ప్రముఖ హీరోయిన్స్ డిమాండ్లతో పోలిస్తే.. రష్మీ ఇబ్బంది పెట్టదంటారు. దీంతో.. టాప్ హీరోయిన్స్ చేత ఓపెనింగ్ చేసే బడ్జెట్ తో సగానికే రష్మీ తో ఓపెనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసే వీలుందంటున్నారు. గతంలో ప్రముఖ షోరూంలు మాత్రమే సినీ హీరోయిన్లతో ఓపెనింగ్ చేసేవి.

 కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక మోస్తరు షోరూంలు కూడా సెలబ్రిటీలతో ఓపెనింగులు చేయించటం ద్వారా తమ వ్యాపార సంస్థకు భారీ ఇమేజ్ వస్తుందని.. ఊరు మొత్తం తెలిసిపోతుందని.. పేపర్లలో ఫ్రీ పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో సెలబ్రిటీలను ఓపెనింగ్ లకు పిలుస్తున్నారు. ఇలాంటి వారికి హీరోయిన్స్ తో అయితే భారీ బడ్జెట్ బండ ఖాయం. దాన్ని తప్పించుకోవటానికి ప్రజల్లో మాంచి క్రేజ్ తో పాటు.. యూత్ తో గుర్తింపు ఉన్న రష్మీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. మూడు ఓపెనింగ్ లు ఆరు షోలుగా రష్మీ పరిస్థితి మారిందంటున్నారు.