తమ్ముడు కొండకు అంత బడ్జెట్టా?

Sat Oct 12 2019 11:25:52 GMT+0530 (IST)

ఒక్క సినిమా హిట్టయితే చాలు కుర్ర హీరోలకు ఫోన్ లిఫ్ట్ చేసే టైమే ఉండదు. ఇండస్ట్రీ పెద్దలు.. సినీజర్నలిస్టులు సైతం ముందు అపాయింట్ మెంట్ కోసం చాలానే వెంటపడాల్సి ఉంటుంది. హీరో లెక్క అలా ఉంటుంది మరి. వరుసగా నాలుగైదు అడ్వాన్సులు వగైరా వగైరా హడావుడి మామూలుగా ఉంటుందా?  పైగా టాలీవుడ్ ఒక్కటే కాదు కదా.. ఇరుగు పొరుగు భాషల్లోనూ కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉంటే చాలు నటించేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినా సెటిలైపోవచ్చు.అయితే ఇలాంటి డైలమాలేవీ లేకుండా నిర్మాత కం పంపిణీదారుడు బెల్లంకొండ సురేష్ తన కుమారుల్ని వెండితెరకు పరిచయం చేస్తున్న తీరు ఆల్ టైమ్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇప్పటికే పెద్దోడు బెల్లంకొడ సాయి శ్రీనివాస్ ని హీరోగా నిలబెట్టేశారు. మొన్న రాక్షసుడు సినిమాతో హిట్టు కొట్టాక ధీమా పదింతలైంది. ఫ్లాపు హీరోగా మొదలైనా.. మినిమం మార్కెట్ ఉన్న యాక్షన్ హీరోగా ఎదిగాడు శీనూ. ఇకపై తమ్ముడు కొండ వంతు వచ్చింది. ఇటీవలే శ్రీను సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం భారీగానే పెట్టుబడులు పెట్టనున్నారని అర్థమవుతోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్. గణేష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథాంశం ఇదని తెలుస్తోంది. గణేష్ సరసన నాయికను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇప్పటికే కీలక తారాగణంపై అమెరికా షెడ్యూల్ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. ఇతర కాస్టింగ్ ఎంపికలు సాగుతున్నాయట. అన్నట్టు సాయి శ్రీనివాస్ డెబ్యూ సినిమా అల్లుడు శీను కోసం బెల్లంకొండ ఏకంగా రూ.20కోట్ల బడ్జెట్ ని పెట్టారు. ఇప్పుడు రెండో తనయుడిపై ఎంత బెట్టింగ్ పెడుతున్నారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తే.. ఈసారి అందుకు భిన్నంగా నవతరం దర్శకుడు పవన్ సాధినేని రెండో కొడుకును చిన్న కొండను పరిచయం చేస్తుండడం ఆసక్తికరం.