Begin typing your search above and press return to search.

'ఒక్కడు'లో విలన్ రోల్ ఎలా గోపీచంద్ చేజారిపోయిందంటే ..?!

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 AM GMT
ఒక్కడులో విలన్ రోల్ ఎలా గోపీచంద్ చేజారిపోయిందంటే ..?!
X
మహేషే బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'ఒక్కడు' ఒకటిగా చెప్పుకోవచ్చు. మహేశ్ బాబులోని హీరోయిజాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది అని చెప్పచ్చు. అలాగే దర్శకుడు గుణశేఖర్ కీ .. నిర్మాతగా ఎమ్మెస్ రాజుకి ఇది చెప్పుకోదగిన సినిమా. అలాంటి ఈ సినిమాలో విలన్ గా ప్రకాశ్ రాజ్ చేసిన 'ఓబుల్ రెడ్డి' పాత్రను ప్రేక్షకులకు ఇప్పటికీ మరిచిపోలేదు. ప్రకాశ్ రాజ్ ను కూడా ఆ పాత్ర మరింత బలంగా నిలబెట్టేసింది. అలాంటి ఆ పాత్రను తాను పోషించవలసిందని గోపీచంద్ అన్నాడు.

తాజాగా 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో గోపీచంద్ మాట్లాడుతూ 'ఒక్కడు' సినిమాను గురించి ప్రస్తావించాడు. ఆ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ .. 'ఒక్కడు' సినిమాలో విలన్ పాత్రను చేయమని నన్ను అడిగారు. ఆ పాత్రకి ముందుగా ప్రకాశ్ రాజ్ గారిని అనుకున్నారు.

ఆ సమయంలో ఆయన బాగా బిజీగా ఉండటం వలన డేట్స్ కుదరలేదు. దాంతో 'ఒక్కడు' ఆఫీస్ నుంచి కాల్ చేస్తే వెళ్లాను .. గుణశేఖర్ గారు కథ చెప్పారు. ఓబుల్ రెడ్డి పాత్ర నాకు చాలా బాగా అనిపించింది. దాంతో నేను వెంటనే ఓకే చెప్పేశాను.

ఆ తరువాత ప్రకాశ్ రాజ్ గారు ఆ సినిమా కోసం తన డేట్స్ సర్దుబాటు చేశారు. అట్లా మళ్లీ ఆ పాత్ర ప్రకాశ్ రాజ్ గారి దగ్గరికే వెళ్లడం జరిగింది. అలా ఆ సినిమాలో చేసే అవకాశం పోయింది అని చెప్పాడు. 'ఒక్కడు' సినిమా 2003 సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఎమ్మెస్ రాజు బ్యానర్లో విలన్ రోల్ చేయలేకపోయిన గోపీచంద్, ఆ తరువాత అదే బ్యానర్లో 'వర్షం' సినిమాలో విలన్ గా చేశాడు. ఈ సినిమా 2004 సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లను రాబట్టడం విశేషం.

ఇక 'యజ్ఞం' సినిమాను గురించి గోపీచంద్ మాట్లాడుతూ .. 'యజ్ఞం' సినిమా కథను నా కోసం అనుకుని తయారు చేసింది కాదు. ముందుగా ఈ కథను ప్రభాస్ గారికి చెప్పారు .. ఆ తరువాత కల్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్లింది.

కొన్ని కారణాల వలన వాళ్లు చేయలేకపోయిన ఆ కథ నా దగ్గరికి రావడం .. నేను చేయడం జరిగిపోయింది. నేను చేసిన 'రణం' .. 'లౌక్యం' సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి కామెడీ మళ్లీ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఉండటం వలన, ఇది కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చాడు.