రాబోయే రోజుల్లో 'రాధే శ్యామ్' ప్లాన్స్ ఎలా ఉంటాయో..?

Wed Nov 24 2021 16:40:35 GMT+0530 (IST)

How are Radhe Shyam plans in the coming days

'సాహో' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా ''రాధే శ్యామ్''. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ తో ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.

'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మిగతా సంక్రాంతి విడుదల సినిమాలలో పోల్చుకుంటే మొన్నటి వరకు 'రాధే శ్యామ్' మీద హైప్ తక్కువే ఉంది. మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఈ సినిమాపై బజ్ ఏర్పడుతోంది. ఇదే డార్లింగ్ ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది.

ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న 'రాధే శ్యామ్' మేకర్స్.. ఇటీవల 'ఈ రాతలే' అనే ఫస్ట్ సింగిల్ తో ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చారు. రెగ్యులర్ లిరికల్ వీడియో మాదిరిగా కాకుండా భిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ లో కొనసాగింది. అయితే ఆ తర్వాత ఇతర పెద్ద సినిమాలు వచ్చి సందడి చేయడం మొదలు పెట్టాయి.

‘రాధే శ్యామ్’ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. కాకపోతే సినిమా విడుదలయ్యే వరకు బజ్ సజీవంగా ఉంటుందా? అని ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో అయినా రెగ్యులర్ గా ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ ఇతర సినిమాలకు పోటీగా నిలుపుతారో లేదో అని ఆలోచిస్తున్నారు.

కాగా 'రాధే శ్యామ్' చిత్రాన్ని 1970స్ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో చేయి చూసి భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్య అనే పామిస్ట్ గా ప్రభాస్ కనిపించనున్నారు.

భారీ క్యాస్టింగ్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందుతోంది. టీ సిరీస్ - యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.